Wednesday, 21 December 2016

ఆవు-పులి కథ

ఒక ఊళ్ళో ఒక ఆవు వుండేది, అది అందరితో చాలా మంచిగా, కలహించుకోకుండా, యజమాని మెప్పినట్లు నడుచుంటూ సాధు జంతువుగా నమ్మకంగా ఉండేది, ఒకరోజు అది అడవిలో మేతమేస్తుండగా , బాగా ఆకలితో అటు వచ్చిన పులి కంట బడింది, పులి ఎంతో అందంగా బలంగా నిగ నిగ లాడుతున్న ఆవుచూడగానే అప్పటివరకు ఆపుకున్న ఆకలి ఒక్కసారిగా విజృంభించి ఆవుపైకి దూకబోయింది, ఇది గమనించిన ఆవు ఆగు ఆగు పులిరాజ నేను చెప్పే మాటలు కొంచం ఆలకించు..నాకు ఇంటి వద్ద చంటి దూడ ఉంది అది ఇంకా లోకం గురించి పూర్తిగా తెలుసుకోలేదు నేను ఈ పూట దాని ఆకలైనా తీర్చలేదు నీవు దయ తలిస్తే నేను వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి అందరితో ఎలా నడుచుకోవాలో, కొన్ని మంచి బుద్దులు నేర్పి వస్తాను అని వేడుకుంది.


ఆవు మాటలకు పులి ఫక్కున నవ్వింది, ఒహో ఎంత నమ్మకంగా పలుకుతున్నావు చేతికి దొరికిన ఆహారాన్ని వదలడానికి నేనేమన్న పిచ్చిదాన్నా, చాలా ఆకలిమీదున్నాను నీ మాయమాటలకి పడిపోయి నిన్ను వదుల్తా ననుకున్నావా. అయ్యో!  పులి రాజ నన్ను నమ్ము నేనెప్పుడూ అసత్యమాడలేదు, నువ్వుదయతలిస్తే వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలు ఇచ్చివస్తాను, నిన్ను మోసగించి నేను బతకగలనా అయినా ఆ అసత్యపు జీవితం నాకు ఏల ఆకలితో అలమటిస్తున్న నీకు ఆకలి తీర్చడంకన్నా పుణ్య కార్యముందా నన్ను నమ్ము.


పులి ఆవుమాటలకు నవ్వి సరే వెల్లు కాని మళ్ళీ తిరిగిరాకపోయావో ఈ రోజుకాకపోయినా మరునాడు నువ్వు నాకు చిక్కకపోవు అప్పుడు చెపుతా నీ సంగతి అంది.అంతమాటలకే సంతోషించిన ఆవు ఆగమేగాలమీద ఇళ్ళు చేరుకుని తన బిడ్డకి కడుపునిండా పాలిచ్చి, బిడ్డా ఇదే నా ఆఖరిచూపు, మంచి దానిగా మసులుకో, బుద్దిమంతురాలుగా యజమానికి సహకరించు, తోటి వారితో సఖ్యంగా ఉండు గొడవలద్దు, జీవితంలో ఎప్పుడూ అబద్దం ఆడరాదు, సత్యాన్నే పలుకు అది నీకు మేలు చేస్తుంది, అందరిలోకి మంచిదానవుగా పేరు తెచ్చుకో జీవితాన్ని సార్థకం చేసుకో అని మంచి బుద్దులు చెప్పి సెలవుతీసుకుని అడవికి బయలుదేరింది.


అడవిలో ఆవు రాక కోసం అసహనంగా ఎదురుచూస్తున్న పులి, దూరంగా ఆవు రావడం కనిపించి ఆశ్చర్యపోయింది, ఆహా ఈ ఆవు ఎంత నమ్మకమైనది, అన్న మాట ప్రకారం నాకు ఆహారంగా అవడనికి తిరిగి వస్తుంది, తన ప్రాణం కంటే ఇచ్చిన మాట ముఖ్యం అని అన్న ఈ ఆవు ఎంత గొప్పది, ఇలాంటి సత్యవచణురాలిని చంపితే నాకు పాపం తప్పదు అనుకుంది.ఆవు దగ్గరికి రాగానే, ఓ మహోత్తమురాల నువ్వు ఎంత సత్యవచణురాలివి ఇచ్చిన మాట కోసం ప్రాణాలు లెక్క చేయక నాకు ఆహారమవడానికి వచ్చిన నిన్ను చంపితే నాకు మహా పాపం చుట్టుకుంటుంది, నిన్ను హేళన చేసినందుకు నన్ను మన్నించు నా ఆకలి ఈ రోజు కాకపోతే రేపు ఎదో విధంగా తీర్చుకుంటాను నువ్వు ఇంటికి పోయి నీ బిడ్డతో హాయిగా జీవించు అంది.ఆవు సంతోషంతో ఇంటికి చేరి తన బిడ్డతో కలకాలం హాయిగా జీవించింది.


నీతి: అబద్దమాడకూడదు, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది

ఇంత బతుకూ బతికి, ఆఖరికి

చీమలు దూరని చిట్టడవి లో ఓ సింహం ఉంటూ ఉండేది.  సహజంగానే బలపరాక్రమాలున్న జంతువు.  మంటకు గాలి తోడైనట్లు సింహానికి అంతులేని అహంకారము ఉంది.  అడవిలో బ్రతికే తదితర మృగాలన్నిటి చేతా అడ్డమైన చాకిరీ చేయించేది.  సింహం ఆడిందే ఆట, పాడిందే పాట.  ఇలా ఉండగా చిట్టడవికి చెప్పలేనంత కరువొచ్చింది.  ఆ కరువుకి తట్టుకోలేక మృగాలన్నీ తలో దోవా పారిపోయాయి.  మృగాలకి రాజయితే మాత్రం సింహానికి తిండితిప్పలు ఎక్కడివి? బెట్టుగా అక్కడే కొన్నాళ్ళ పాటు నీల్గుతూ ఉంది.  కాని, అది ఆఖరికి కాకులు దూరని కారడవికి ప్రయాణమై వెళ్ళింది. కాకులు దూరని కారడవిలో ఓ నక్కా, గాడిదా, ఎద్దూ, మంచి స్నేహంగా నివాసముంటున్నాయి.  వాటి వాటి తిండితిప్పలు వేరయినా కలసిమెలసి ఉంటున్నాయి.

సింహం అక్కడికి చేరింది. తాను వలస వచ్చినా గర్వాన్ని వదలలేదు.  కాకులు దూరని కారడవికి తానే రాజునని అంది. నక్కా, ఎద్దు, గాడిద – మూడింటితోనూ ఒక ఒడంబడికకు వచ్చింది.  అందరూ కలిసి ఆహారాన్ని సంపాదించాయి.  సింహం ఒక పక్క, తతిమ్మా జంతువులు ఒక పక్క కూచున్నాయి.  సింహం ఎద్దు వేపు చూసి ‘ఎలా పంచిపెడతావో పంచిపెట్టూ’ అని అంది.  ఆహారాన్ని నలుగురికి నాలుగు సమాన వాటాలు వేసింది ఎద్దు. సింహానికి కోపం వచ్చింది.  ఎద్దు మీదకు దూకి పంజాతో చరిచింది.  ఎద్దు చచ్చిపోయింది.  నక్కా, గాడిదా లోలోపలే ఏడ్చాయి.


సింహం నక్క వైపు తిరిగి ఈ సారి నువ్వు పంచూ అని అంది.  నక్క తెలివిగలది.  చప్పున దండం పెట్టి ఆహారాన్ని పంచడం నాకు చేత కాదు! అని అంది. సింహం గర్వానికి అంతు లేకుండా పోయింది.  ‘సరే! నేనే పంచుతాను’ అని ఆహారాన్ని మూడు వాటాలు చేసి ఇలా అంది :


‘నేను మృగరాజుని కనక ఒక వాటా నాది రెండోవాటా మీతో పంచుకోవాలి కనక నాది!’  అని అంటూ మూడో వాటా కాలు నొక్కి పెట్టి,  ‘దమ్ములుంటే మూడో వాటా తీసుకోండి!’ అని అంది.  కాని సింహం కాలి కింద ఆహారాన్ని లాక్కోడానికి ధైర్యం ఎవరికుంది?  ఇలా దౌర్జన్యంగా మొత్తం ఆహారాన్ని సింహం కాజేసింది. తతిమ్మా జంతువులు ఆకలితో నకనకలాడాయి.  ఐతే, సింహం ఒక్కటే ఆత్రంకొద్దీ ఆహారాన్ని మింగింది. ఎద్దుని చంపింది కదూ? దాన్ని కూడా మెక్కింది. తిండికి చిట్టడవిలో మొగం వాచిందో ఏమో, దొరికిందే చాలనుకుని తెగతిన్నది.


సింహానికి జబ్బుచేసింది. చేయదూ మరి! ఆ జబ్బు ముదిరి చచ్చేస్ధితికి వచ్చింది. ఇన్నాళ్ళు సింహంవల్ల బాధపడిన జంతువులు వచ్చి, కసిదీరా సింహాన్ని తిట్టి, తన్ని పోతున్నాయి. సింహం లేవలేకపోయినా గ్రుడ్లురిమి చూచి మూలిగేది.  కాని, ఏ ప్రాణీ భయపడేది కాదు.  ‘బ్రతికి బాగుంటే పగదీర్చుకుంటా’ ననేది.  గ్రుడ్లురిమి చూడ్డంవల్ల కొన్ని జంతువులు యింకా భయపడుతున్నాయి.


ఓ రోజున గాడిద వచ్చింది. ‘నీవుకూడా తన్నిపోవడానికే వచ్చావా?’ అని గ్రుడ్లురిమి చూసింది సింహం.  ‘ఇంకా గ్రుడ్లురుముతున్నావా మృగరాజా!  చింత చచ్చినా పులుపు చావలేదే!’ అంది గాడిద.  సింహం మళ్ళా గ్రుడ్లురిమి చూసింది.  గాడిద మళ్ళీ మాటాడకుండా వెనక్కి తిరిగింది.  సింహం మొగాన్ని గురిచూసి వెనక కాళ్ళతో ఫెడీ ఫెడీ తన్నింది.  దాంతో సింహం రెండు కళ్ళూ రాలిపడ్డాయి.


‘ఇంత బతుకూ బతికి, ఆఖరికి గాడిద చేత కూడా తన్నులు తిని చావవలసి వచ్చింది.  అయ్యో! నాదెంత దిక్కుమాలిన చావు?’ అని ఏడ్చింది సింహం.  కాని ఎవరికి జాలి?

కాకి - హంస

పూర్వం ఒకానొక ద్వీపాన్ని ధర్మవర్తి అనే రాజు పాలించేవాడు. ఆ రాజుగారి పట్టణంలో ఒక వర్తకుడుండేవాడు. చాలా మంచివాడు. గొప్ప భాగ్యవంతుడు. ఓ రోజు ఒక కాకి అతని పంచన చేరింది. అతని కొడుకులు దానికి ఎంగిలి మెతుకులు పెట్టి పెంచారు. అది బాగా బలిసి ఏ పక్షులూ తనకు సరిరావని విర్రవీగుతూండేది.

 

ఒకనాడు సముద్రతీరంలో కొన్ని రాజహంసలు విహరిస్తున్నాయి. వాటిని కాకికి చూపించి "అన్ని పక్షులు కంటే బలమైనదానివి నువ్వు! ఆ హంసల కంటె ఎత్తు ఎగరాలి. సరేనా" అన్నారు వర్తకుని పిల్లలు. ఎంగిళ్ళు తిని బలిసిన ఆ వాయసం తారతమ్యజ్ఞానం లేక హంసల దగ్గరకు వెళ్ళి తనతో పందానికి రమ్మంది. హంసలన్నీ పకపక నవ్వాయి.

 

"మానస సరోవరంలో ఉంటాం. మహా బలవంతులం. హంసలతో సరియైన కాకులు లోకంలో ఉన్నట్లు ఎప్పుడైనా,ఎక్కడైనా విన్నావా?" అన్నాయి. "నూటొక్క గతులలో పరుగెత్తడం చేతనౌను నాకు! ఒక్కొక్క రకం గమనంలో నూరు యోజనాలు వెళ్తాను. మీరెలా కావాలంటే అలా ఎగురుదాం - కావాలంటే పందెం కాద్దాం" అంది కాకి. "ఆ గతులూ గమనాలూ మాకు తెలీదు! మామూలుగా సముద్రం మీద నిటారుగా ఎగురుదాం. మేమంతా రావటం వృథా. మాలో ఏదో ఒక హంస నీతో పోటీకి వస్తుంది" అన్నాయి మరాళాలు.

 

అనటమే తడవు ఒక హంస గుంపులోంచి బయటకు వచ్చింది. కాకి కూడా దాని వెనకాలే వెళ్ళింది. రెండూ సముద్రం మీదుగా ఎగరడం మొదలుపెట్టాయి. హంస నెమ్మదిగా వెళుతూంటే కాకి దానికి తన విన్యాసాలను చూపిస్తోంది. హంసను దాటిపోయి, మళ్ళీ వెనక్కి వచ్చి ఎగతాళిగా పిలవడం, ముక్కుమీద ముక్కు మోపడం, జుట్టు రేపుకుని తిరగడం, ఈకలు ఈకలతో రాయడం, నవ్వడం మొదలైన పనులన్నీ చేసింది. హంస చిరునవ్వు నవ్వి ఊరుకుంది. కాసేపటికి కాకి అలసిపోయింది. అప్పుడు పొడుగ్గా ఎగసి పడమరకు పరుగెత్తింది రాయంచ. కాకి ఇంక ఎంతమాత్రం ఎగరలేక రొప్పుతూ బిక్కమొహం వేసింది. హంసను మించలేకపోగా ప్రాణభీతితో వ్యాకులపడింది. 'అయ్యో! నా అవయవాలన్నీ వికలమైపోయాయి. కాసేపు ఎక్కడైనా ఆగుదామంటే పర్వతాలూ, చెట్లూ, లతలూ ఏవి లేవిక్కడ. ఈ సముద్రంలో పడితే మరణమే గతి' అనుకుంటూ భయపడుతూ కళ్ళు తేలేసింది కాకి.

 

అది చూసి హంస "నీకు చాలా గమనాలు వచ్చన్నావే. గొప్ప గొప్ప విన్యాసాలు చేస్తానన్నావు. ఒక్కటీ చూపవేం వాయసరాజమా?" అంది. కాకి సిగ్గుపడింది. అప్పటికే అది సముద్రంలోకి దిగబడి పోవడానికి సిద్ధంగా వుంది. "ఎంగిళ్లు తిని గర్వంతో కన్నూ మిన్నూ గానక నా కెదురెవరూ లేరనీ, ఎంతటి బలవంతుల్నయినా గెలవగలనని అనుకునేదాన్ని. నా సామర్ధ్యమేమిటో నాకిపుడు తెలిసివచ్చింది. నా యందు దయచూపి నన్ను రక్షించు" అంటూ ఆర్తనాదం చేసింది కాకి. నీళ్ళలో మునిగిపోతూ "కావుమని" దీనంగా అరుస్తున్న కాకిని చూసి జాలిపడి హంస తన కాళ్లతో దాని శరీరాన్ని పైకి లాగింది. చావు తప్పించింది. "ఇంకెప్పుడూ గొప్పలు పోకు" అని మందలించి దానిని తీరానికి విసిరి, ఎగిరిపోయింది రాజహంస. కాకి లెంపలేసుకుంది. .

మానవుడు ఆశాజీవే కానీ అత్యాశ పనికిరాదు

వింధ్యారణ్యం అనే ప్రాంతంలో భైరవుడు అనే పేరుగల వేటగాడు ఉండేవాడు. రోజూ అడవికి వెళ్ళి, రకరకాల ఆహార పదార్థాలను సేకరించి, వాటితో తన కుటుంబాన్ని పోషించేవాడు. అడవిలో దొరికే ఆకులు, దుంపలు, కాయలు, పండ్లు, తేనె, వెదురు బియ్యం లాంటి వాటన్నింటి కంటే భైరవుడికి... కుందేలు, జింక, అడవిపంది వంటి జంతువుల మాంసమంటే భలే ఇష్టం.


ఒకరోజు ఒక బలసిన జింకను వేటాడి చంపిన భైరవుడు, ఇంటిల్లిపాదీ ఆనందంగా విందు చేసుకోవచ్చునే సంతోషంలో దాన్ని భుజంపైన వేసుకొని తన ఇంటి దారి పట్టాడు. అయితే ఆ అడవి మార్గంలో అతనికి అనుకోకుండా బాగా మదించి, కోరలు ఉన్న అడవి పంది ఒకటి కనిపించింది.

భైరవుడు తన భుజం మీది జింక శవాన్ని నేలపైకి దించి, తన విల్లమ్ములు తీసుకుని పదునైన బాణంతో ఆ అడవి పంది రొమ్మును గాయపరిచాడు. అసలే కోపం, మొండితనం ఎక్కువగా ఉండే అడవిపంది గాయాన్ని లెక్కచేయకుండా వేగంగా పరుగెత్తుకొచ్చి భైరవుడి పొట్టను కోరలతో చీల్చి చెండాడి, చంపివేసింది. తర్వాత గాయం బాధ ఎక్కువై అది కూడా చచ్చిపోయింది. భైరవుడు, అడవిపందిల తొక్కిసలాటలో అటుగా వచ్చిన పాము కూడా చనిపోయింది


ఇంతలో క్షుద్రబుద్ధి అనే నక్క ఆహారం వెదకుతూ అటుకేసి వచ్చింది. చచ్చిపడి ఉన్న వేటగాడు, జింక, పంది, పాము దానికి కన్నుల విందుగా కనిపించాయి. నక్కలు స్వయంగా వేటాడలేవు కాబట్టి... పులి, సింహం లాంటి జంతువులు చంపి తిని వదలిన అవశేషాలను, జీవుల శవాలను తిని తృప్తి పడతాయి. అందుకే ఒకేసారి నాలుగూ చనిపోయి కనిపించే సరికి క్షుద్రబుద్ధి ఎగిరి గంతులు వేసింది.

దగ్గరికెళ్లిన నక్క ఇలా ఆలోచించింది "ఈ మనిషి శవం ఒక మాసం పాటు తినొచ్చు. జింక, పంది శవాలను రెండు నెలల పాటు భోంచేయవచ్చు. ఈ పాము తలను తీసేసి ఒక రోజంతా కడుపునింపుకోవచ్చు. అంటే మూడు నెలల ఒక్క రోజు పాటు ఆహారం గురించి వెదికే పనే లేదన్నమాట. మరి ఈ పూట మాటేమిటి? ఆ! ఈ వేటగాని ధనుస్సుకు కట్టివున్న కమ్మని వాసన వేస్తున్న, నరాలతో చేసిన అల్లెత్రాటిని తింటే సరిపోతుంది." అనుకుంది.

అనుకున్నదే తడవుగా నక్క వింటిని సమీపించి, లాగి బిగించి ఉన్న దాని నరాలతో చేసిన అల్లెత్రాడును కొరికింది. అంతే...! పదునైన "వింటి కోపు" దాని శరీరంలో గుచ్చుకుంది. బాధతో విలవిలలాడుతూ... తన దురాశకు చింతిస్తూ నక్క ప్రాణాలు విడిచింది. ఇప్పుడక్కడ నక్కతో కలిపి ఐదు శవాలు పడి ఉన్నాయి.


 భైరవుడు ఒక జింక చాలదని అడవిపందిని వేటాడబోయి చనిపోయాడు. నక్క ఎలాంటి కష్టం లేకుండా మూడు నెలల పాటు తిండి దొరికించుకుని కూడా, పిసినారి తనంతో వింటినారిని కొరికి, తానూ శవంగా మారింది. దీన్నిబట్టి మీకెమర్థమయ్యింది పిల్లలూ...! దురాశ దుఃఖానికి చేటు.

దురాశ దు:ఖానికి చేటు

రామాపురం అనే గ్రామంలో శివశర్మ అనే బ్ర్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఆ చుట్టుప్రక్కల ఉన్న నాలుగైదు గ్రామాలకు పురోహితుడు. ఒకనాడు పొరుగున ఉన్న కృష్ణాపురంలో వ్రతం చేయించటానికి బయలుదేరాడు. రామాపురం నుంచి కృష్ణాపురం వెళ్ళటానికి మధ్యలో రెండు మైళ్ళ దూరం అడవిని దాటి చేరుకోవాలి. ఆ అడవిలో కౄర జంతువులు లేకపోవటం వల్ల రామాపురం గ్రామస్థులు భయం లేకుండా అడవిని దాటి వెళ్ళేవారు. శివశర్మ అడవిలో నడుస్తుండగా అతనికి ఒక చెరువు గట్టు మీద దర్భలు చేతిలో పట్టుకుని కూర్చున్న పెద్దపులి కనిపించింది. దానిని చూడగానే శివశర్మ గుండెల్లో రాయి పడింది.


       భగవంతుడా! 'ఈ అడవిలో కౄర జంతువులు ఉండవు కదాని ఒంటరిగా బయలుదేరాను... ఇప్పుడు ఈ పెద్దపులి కనిపించింది. దీని బారి నుంచి నన్ను నువ్వే కాపాడాలి' మనసులో దేవుడిని తలచుకుంటూ అనుకున్నాడు. ఆ సమయంలోనే ఆ పెద్దపులి శివశర్మను చూడనే చూసింది. శివశర్మ కాళ్ళు చేతులు భయంతో వణికాయి. ఓ! బ్ర్రాహ్మణుడా నన్ను చూసి భయపడకు. కౄర జంతువయినా... ఇప్పుడు మాంసాహారిని కాదు... ఇప్పటిదాకా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని భగవంతుడిని ప్రార్దించాను... దేవుడు ప్రత్యక్షమయ్యి ఈ కంకణం ఎవరికైనా దానం చేస్తే నా పాపాలు పోతాయని చెప్పాడు. అందుకే నువ్వు ఈ కంకణం తీసుకో అంటూ తన చేతిలో ఉన్న కంకణాన్ని శివశర్మకు చూపించింది. అది నవరత్నాలు పొదిగిన బంగారు కంకణం. చెట్ల ఆకుల్లోంచి పడుతున్న సుర్యుడి వెలుగుకి ధగధగా మెరుస్తోంది. దాన్నిచూడగానే శివశర్మ మనసులో ఆశ పుట్టింది .

నువ్వు పులివి, కౄర జంతువువి కూడా. నీ మాటలను నేను ఎలా నమ్మాలి. భలేవాడివే నువ్వు! నేను నిజంగా కౄర జంతువునే అయితే నువ్వు కనిపించగానే నిన్ను చంపి నీ మాంసంతో విందు చేసుకునే దానిని, కానీ ఈ బంగారు కంకణం తీసుకుపో అంటూ ఎందుకు చెప్పేదానిని అంది పెద్దపులి. శివశర్మ ఆ మాటలకు తృప్తి పడ్డాడు, నిజమే... పులి కౄర జంతువే కనుక అయితే అది కనిపించగానే తను పారిపోయినా వెంటాడి చంపి ఉండేది. అలా చెయ్యలేదు కనుక ఇది పాపాల నుండి విముక్తి కోసం తాపత్రయం పడుతూ ఉండి ఉంటుంది. శివశర్మ మనసులో భయం పోయి ఆ బంగారు కంకణం ఇటు విసురు, అది తీసుకుని నిన్ను ఆశీర్వదించి నా దారిన నేను పోతాను.      నీకు పాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. దానికి ఆ పెద్దపులి నవ్వి భలే బ్రాహ్మ ణుడివయ్యా నువ్వు... శాస్త్రాలు చదివావు అని అందరికీ చెబుతావు... నువ్వు మాత్రం వాటిని పాటించవా... ఏదన్నా దానం తీసుకునేటప్పుడు స్నానం చేసి ఆ దానం తీసుకోవాలి కదా..! అందుకే నేను దానం తీసుకునేవాళ్ళకి శ్రమ లేకుండా ఈ చెరువు ప్రక్కన కుర్చున్నాను. నువ్వు స్నానం చేసివచ్చి ఈ బంగారు కంకణం నా దగ్గర నుంచి దానంగా తీసుకుని నన్ను ఆశీర్వదించు అంది.

శివశర్మ ఆ మాటకి సరే! అలాగే అంటూ స్నానం చెయ్యటానికి చెరువులోకి దిగబోయాడు మెత్తగా ఉన్నచెరువు గట్టున బురదనేలలోనడుంవరకు దిగబడిపోయాడు అతను. అది చూసిన పులి అయ్యయ్యో ! బురదలో దిగబడి పోయావా..? ఉండు రక్షిస్తాను అంటూ తన కూర్చన్న చోటు నుంచి తాపీగా లేచి వచ్చి ఒడ్డున నిల్చుని శివశర్మ కంఠం దొరకపుచ్చకుని అతన్ని చంపి మాంసంతో విందు చేసుకుంది.

చూశారా..! దురాశ దు:ఖానికి చేటు. బంగారు కంకణానికి ఆశపడి శివశర్మ పులిచేతిలో ప్రాణాలను పోగొట్టుకున్నాడు. అందుకే ఎదుటివాళ్ళు చూపించే కానుకలకు ఎప్పుడూ ఆశపడరాదు. ఎవ్వరూ విలువైన వస్తువులను ఉచితంగా ఇవ్వరు అన్న సంగతి తెలుసుకుని దురాశకు పోరాదు.

ఐకమత్యం

ఒక అడవిలో నివసిస్తుండే ఒక నక్కకి ఒకనాడు బాగా ఆకలి వేసింది. దాంతో అది అడవి అంతా గాలించి ఎక్కడా ఆహారం దొరకక అది విసిగి వేసారిపోయింది. చివరికి ఆ నక్క కొన్ని జింకలు, దుప్పులు ఐక్యమత్యంగా కలిసి జీవించే ఒక చోటుకి బయలు దేరింది. అక్కడ తనకేదయిన ఆహారం దొరక్కపోతుందా అని అనుకుంటూ. నక్క అక్కడికి చేరే సరికి కొన్ని జింక పిల్లలు, దుప్పి పిల్లలు సంతోషంతో కేరింతలు కొడూతూ ఆడుకోసాగాయి. అవి నక్క బావని ఒకసారి పలకరించి మళ్ళీ తమ ఆటలో లీనమయిపోయినాయి.


 
నక్కకి వాటిని చూడగానే తను బూరెల గంపలో పడ్డట్టయ్యింది. ఆ టక్కరి నక్క వాటిని తన ఆహారంగా ఎలా మార్చుకోవాలా అని ఆలోచిస్తూ అది ఒక చెట్టు క్రింద కూర్చొని అవి ఆడే ఆటలని జాగ్రత్తగా గమనించడం మొదలు పెట్టింది. అవి ఆడుకొనే చోట ఒక చిన్న పిల్లకాలువ, దానిని దాటుటకు దానిపై ఒకేసారి ఒకటి మాత్రమే దాటటానికి అవకాశం వుండే ఒక తాటి మొద్దు వేసి ఉంది. దుప్పి పిల్లలు వాటి ఆటలో భాగంగా రెండు పిల్లలూ రెండు వైపుల నుండీ ఒకేసారి బయల్దేరి సరిగ్గా చెట్టు తాటి మొద్దు మధ్యకు వచ్చాయి. ఆ సరికి ముందుకు వెళ్ళటానికి ఆ రెండు దుప్పి పిల్లలకు అసాధ్యమయిపోయింది. ఆ రెండింటిలో ఏదో ఒకటి వెనక్కి వెళితేకాని రెండవ పిల్ల ముందుకు సాగిపోవటానికి వీలు కాకపోవటంతో అవి రెండూ సమాధానపడి, ఒక దుప్పి ఆ తాటి మొద్దుపై పడుకోగా రెండవది జాగ్రత్తగా దానిపై నుండి దాటి అవతలివైపుకి చేరింది. ఆ తర్వాత పడుకున్న దుప్పి కూడా లేచి నిరాటంకంగా ఇవతలివైపుకు వచ్చి చేరింది.


ఇదంతా ఆసక్తిగా గమనించగానే ఆ నక్క మెదడులో చటుక్కున ఒక ఆలోచన మెరిసింది. దాంతో అది వెంటనే ఆ దుప్పి పిల్లల వద్దకు వెళ్ళి వాటితో మీరిద్దరూ అలా సమాధానపడటం, ఒకటి రెండవదానికి తలవంచడం మన జంతుజాతికే అవమానకరం. మీరిద్దరూ మీ మీ బలా బలాలు పరీక్షించుకొని మీలో బలహీనుడు, బలవంతుడికి ముందుకి వెళ్ళడానికి దారివ్వాలని చెబుతూ అది రెండింటిని రెచ్చగొట్టింది. దాంతో నక్క మాటలు బాగా తలకెక్కించుకున్న ఆ రెండు పిల్లలు పౌరషంతో మళ్ళీ ఆట ప్రారంభిస్తూ తాటి మొద్దు మధ్యకు వచ్చాయి. కాని ఈసారి వాటిలో ఏ ఒక్కటీ, సమాధానపడక రెండవ దానికి దారివ్వటానికి ఎంత మాత్రం ఇష్టపడలేదు. దాంతో అవి వెంటనే నక్క బావ చెప్పినట్లు బలపరీక్షకు సిద్దపడ్డాయి.

 

 
 తాటి మొద్దుపై నుండి రెండూ ఒకేసారి వేగంగా వెనక్కి వెళ్ళి, అంతకు రెట్టించిన వేగంతో ముందుకు వచ్చి, రెండూ తమ తలల్ని గట్టిగా ఢీ కొన్నాయి. ఆ పోట్లాటలో అవి రెండూ పట్టుతప్పి కాలవలో పడి మరణించాయి. దాంతో నక్క వేసిన ఎత్తుగడ పారింది. ఆ రెండు దుప్పి పిల్లల మృతదేహాలు ఆ రోజుకి తన పొట్ట నింపడమే కాకుండా మరో రెండు రోజులకి సమకూరడంతో ఆ నక్క ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైయింది. ఈ సంఘటనని దుప్పి పిల్లలు, జింక పిల్లలద్వారా తెలుసుకున్న పెద్ద దుప్పులు తమ ఐక్యమత్యాన్ని దెబ్బతీసి, తమలో తాము కలహించుకొనేటట్టుచేసి, తనపబ్బం గడుపుకున్న నక్కబావకి ఎలాగయినా బుద్ది చెప్పాలనుకున్నాయి. ఒకరోజు తన ఆహారం కాస్త అయిపోయాక మళ్ళీ అక్కడకు చేరిన జిత్తులమారి గుంట నక్క ఈ సారి కూడా చెట్టు క్రింద తిష్ట వేసి దుప్పి పిల్లలు జింకపిల్లలు ఆడే ఆటలని గమనించసాగాయి. అయితే ఈ సారి పిల్ల దుప్పులు కాకుండా పెద్ద దుప్పులు ఆట మెదలెట్టాయి. అవి కూడా మెదట పిల్ల దుప్పులు ఆడినట్టుగానే తాటి మొద్దు మధ్యకు వచ్చి ఒకదానిపై మరొకటి అవతలకి, రెండవది యివతలకి వచ్చి చేరాయ


ఇదంతా గమనిస్తున్న నక్క ఒక్కసారి ఆనందంతో తలమునకలయ్యింది. ఈసారి కూడా తన పథకం ఫలిస్తే చావబోయేవి పెద్ద దుప్పులు కాబట్టి తనకు దాదాపు పది రోజులకి సరిపడే ఆహారం లభిస్తుంది. ఇలా ఆలోచించిన ఆ నక్క ఆ రెండు దుప్పులను సమీపించి, మునుపటి పిల్ల దుప్పులకు చెప్పినట్లే బలపరీక్ష విషయం గురించి వాటితో చెప్పింది. దాని సూచన నచ్చిన పెద్ద దుప్పులు రెండూ వెంటనే ఒప్పుకొని తమ ఆట తమ తమ పరిధులు ఎంతవరకు వున్నాయో నిర్ణయించడానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించమని నక్కని కోరాయి. అందుకు నక్క ఆనందంగా అంగీకరించి తాటి మొద్దు పైనుంచొని వాటికి హద్దులు నిర్దేశించటంలో లీనమయ్యింది. ఇంతలో ఆ రెండు పెద్ద దుప్పులు శరవేగంతో వెనక్కి వెళ్ళి అంతకు రెట్టింపు వేగంతో పరిగెత్తుకు వచ్చి నక్క మధ్యలో వుండగా తమ తలల్ని గట్టిగా ఢీ కొన్నాయి. అంతే ఆ దెబ్బతో నుజ్జు నుజ్జయిన నక్క బావ తిక్క కుదిరి ఠపీమని చచ్చూరుకుంది. తమ శత్రువుని ఎత్తుకు పై ఎత్తువేసి, చిత్తు చేసినందుకు జింకలు దుప్పులు సంతోషపడి మళ్ళీ ఎప్పటిలా ఐకమత్యంతో కలిసి జీవించసాగాయి.

దుష్టులతో స్నేహం

ఒక రోజు ఓ నక్క నదీ తీరాన్న కూర్చుని భోరు భోరుమని ఎడుస్తోంది. అది విని చుట్టు పక్కల కన్నాల్లో ఉన్న పీతలు బయిటికి వచ్చి నక్కను “ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగాయి.“అయ్యో! నన్ను నా బృందంలోని వేరే నక్కలన్ని అడివిలోంచి తరిమేసేయి” అని ఎడుస్తూనే సమధనమిచ్చింది నక్క. పీతలు జాలిగా ఎందుకల జరిగిందని అడిగాయి.

             “ఎందుకంటే ఆ నక్కలన్ని మిమ్మల్ని తినాలని పన్నాగమల్లుంతుంటే నేను వద్దన్నాను – మీ లాంటి చక్కని జీవాలను అవి ఎలా తినాలనుకున్నాయి?” అంది నక్క. “ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు” అని అడిగాయి పీతలు. “తెలీదు, ఎమైనా పని చూసుకోవలి” అని దీనంగా జవబిచ్చింది ఆ నక్క. పీతలన్ని కలిసి అలోచించాయి. “మన వల్లే దీనికీ కష్టం వచ్చింది, మనమే ఆదుకోవాలి” అని నిర్ధారించాయి. వెళ్ళి నక్కను తమకు కాపలాకి వుండమని అడిగాయి. నక్క దబ్బున ఒప్పుకుని కృతఙతలు తెలిపింది. రోజంతా పీతలతో వుండి వాటికి కథలు కబుర్లూ చెప్పి నవ్విస్తూనే వుంది.


               రాత్రయి పున్నమి చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడు. నదీ తీరమంత వెన్నెలతో వెలిగిపోయింది.“ఈ చక్కని వెన్నెలలో మీరు ఎప్పుడైన విహరించారా? చాలా బగుంటుంది” అని నక్క పీతలని అడిగింది. భయంకొద్ది ఎప్పుడు వాటి కన్నాలను దాటి దూరం వెళ్ళ లేదని చెప్పిన పీతలను నక్క వెంటనే తీస్కుని వెళ్దామని నిశ్చయించుకుంది. నేనుండగా మీకు భయమేమిటి అని నక్క నచ్చ చెప్పడంతో పీతలు కూడ బయలుద్యారాయి.


                  కొంత దూరమెళ్ళాక నక్క మూలగడం మొదలు పెట్టింది. పీతలన్ని ఆశ్చర్యంగా ఏమైందో అని చూస్తుండగా హటాత్తుగా అడివిలోంచి చాలా నక్కలు బయిటికి వచ్చి పీతల పైబడ్డాయి. పీతలు బెదిరిపోయి అటు ఇటూ పరిగెత్తడం మొదలెట్టాయి. కాని నక్కలు చాలా పీతలను దిగమింగేశాయి.ఎలాగోలాగ ప్రాణాలను కాపాడుకున్న కొన్ని పీతలు అతికష్టంగా వాటి కన్నాలను చేరుకుని టక్కుగల నక్క చేసిన కుతంత్రము తలుచుకుని చాలా బాధ పడ్డాయి. దుష్టులతో స్నేహం చెడుకే దారి తీస్తుందని వాటికి అర్ధమయ్యింది.

కాకి బావ ఉపాయం

యమునా నది ఒడ్డున ఒక అందమైన వనంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక కాకుల జంట నివసిస్తుండేది. ఆ మర్రిచెట్టు క్రింద ఒక పుట్ట ఉన్నది. ఆ పుట్టలో ఒక పాము ఉంటున్నది. కాకి గుడ్లను పెట్టినప్పుడు వాటిని పాము తింటుండేది. కాకులు పాముని ఏమీ చేయలేక ఏడుస్తుండేవి. ఈ విధంగా చాలా సార్లు ఆ పక్షులు పెట్టిన గుడ్లను పాము తిన్నది.


        కాకి ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే ఒక నక్క చూసింది. అది కాకిని సమీపించి " కాకి బావ కాకి బావ! ఎందుకు ఏడుస్తున్నావ్ నీకు వచ్చిన సమస్య ఏమిటి? " అని అడిగింది. కాకి నక్కతో " నక్క బావా నక్కబావా నా గర్భశొకాన్ని ఎవరితో చెప్పుకొనేది నేను పెట్టిన గుడ్లను పొదిగి వాటి నుండి పిల్లలు వస్తే సంతోషించాలనుకున్నాను. అని కావ్ కావ్ మని అరుస్తుంటే విని ఆనందించాలను కున్నాను. కాని నాకు ఆ అదృష్టం లేదు" అని బాధపడింది.


         నక్క కాకితో "మీ పక్షులు గుడ్లు పెట్టడం, వాటి నుండి పిల్లలు రావడం సహజమే కదా! "అన్నది.కాకి "నిజమే కాని నా గుడ్లను పాము నిర్దయగా తింటున్నది" అని బధతో అన్నది. నక్క "మరి ఆ పాముని చంపబోయావా?" అన్నది. ఆ పని నా వల్ల కాదుకదా" అన్నది కాకి. అప్పుడు నక్క " శత్రువు బలవంతుడైనప్పుడు ఉపాయముతో అతనిని తప్పించాలి " అని నక్క వెళ్ళిపోయినది కాకి చాలా సేపు ఆలోచించినది. దానికి చక్కటి ఉపాయం తట్టింది. యమునకు సమీపమున విలాసధామం అను పట్టణం ఉన్నది. ఆపట్టణంలో అందమైన కొలను ఉన్నది. ప్రతిరోజు రాణి ఆమె చెలికత్తెలు ఆ కొలనుకి వచ్చి జలక్రీడలు ఆడతారు. ఒకరోజు రాణి చెలికత్తెలతో వచ్చింది. అందరూ తమ నగలను ఒడ్డున ఉంచి కొలనులో దిగారు. కాకి రాణి గారి ముత్యాలా హారాన్ని ముక్కున కరచుకొని ఎగిరింది. చెలికత్తెలు దానిని గమనించి భటులను హెచ్చరించారు.


     రాజభటులు కాకి వెంటబడ్డారు. కాకి నెమ్మదిగా ఎగురుతూ పుట్టవద్దకు వచ్చింది రాజభటులు కూడా దానిని వెంబడిస్తూ పుట్ట దగ్గరకు చేరారు. అపుడు కాకి ముత్యాలహారాన్ని పుట్టలో వేసి, చెట్టుపైకి ఎగిరింది. రాజభటులు హారంకోసం పుట్టను త్రవ్వారు. అపుడు పుట్ట నుండి పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. రాజభటులు దానిని ఈటెలతో పొడిచి చంపారు. భటులు ముత్యాలహారం తీసుకొని వెళ్ళిపోయారు. పాము పీడ వదలినందుకు కాకుల జంట సంతోషించాయి.

నీచులతో స్నేహం చేస్తే చివరకు తమ ప్రాణాలకే ముప్పు వస్తుందని

భాగీరథి నది ఒడ్డున ఒక పెద్ద జువ్వి చెట్టు ఉంది. దాని తొర్రలో "జరద్గవము" అను ముసలి గద్ద నివసిస్తుండేది. పాపం ఆగద్దకు కళ్ళు కనిపించవు. అందువలన అది ఆహారం సంపాదించడం కష్టమయ్యేది.


ఆ చెట్టుపై అనేక పక్షులు గూళ్ళు కట్టుకొని ఉంటున్నాయి. ఆ పక్షులు తాము తెచ్చిన ఆహారంలో కొంత భాగాన్ని గద్దకు పెడుతుండేవి. ఆ ఆహారంతో గ్రద్ద జీవిస్తూ ఉండేది.ఓకరోజు దీర్ఘకర్ణము అను పిల్లి చెట్టుపై ఉన్న పక్షి పిల్లలను తినాలని చెట్టువద్దకు నిశబ్దముగా చేరింది. దనిని చూచిన పక్షి పిల్లలు భయంతో అరిచాయి. వాటి అరుపులు విని గద్ద ఎవరో వచ్చారని గ్రహించింది. "ఎవరక్కడ?" అని గట్టిగా అరచింది.


గద్దను చూచి పిల్లి భయపడింది. దనికి తప్పించుకొనే అవకాశం లేదు. అందువలన అది వినయంగా గద్దతో "అయ్యా! నా పేరు దీర్ఘకర్ణుడు. నేనొక పిల్లిని. మీ దర్శనము కొరకు వచ్చాను" అన్నది. గద్ద కోపంగా "ఓ మార్జాలమా! వెంటనే ఇచటి నుండి పారిపో లేదంటే చచ్చిపోతావు"అన్నది. పిల్లి గద్దతో "అయ్యా మీరు పెద్దలు. మీరు గొప్ప ధర్మాత్ములని తెలిసి వచ్చాను."


పిల్లి జాతిలో పుట్టినా నేను రోజు గంగలో స్నానం చేస్తాను, కేవలం శాకాహరం తింటూ జీవిస్తున్నాను. మాంసాహారం మానివేసిచాంద్రాయణ వ్రతంను ఆచరిస్తున్నాను. మీరు మంచివారని, మీ వద్ద ధర్మశాస్త్ర విశేషాలు తెలుసుకోవాలని వచ్చాను. వచ్చిన అతిథిని శత్రువయినను గౌరవించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కాని మీరు నన్ను తరిమేస్తున్నారు" అన్నది.


గద్ద పిల్లి మాటలకు మెత్తబడింది. "చెట్టు పైన పక్షిపిల్లలున్నాయి. పిల్లులకు మాంసం అంటే ఇష్టం కదా. అందుకని నిన్ను వెళ్లమన్నాను." అంది. పిల్లి తన రెండు చెవులు మూసుకొని "కృష్ణ! కృష్న పూర్వజన్మలో ఏంతో పాపం చేసి ఈ జన్మలో పిల్లిగా పుట్టాను. అందువలనే ఇంత ఖటినమైన మాటలు వినవలసి వస్తుంది. అయ్యా! మీ మీద ఒట్టు.


నేను మాంసమును ముట్టను. అహింసయే పరమ ధర్మము అను సూత్రమును నమ్మినదానిని" అన్నది. గ్రద్ద పిల్లిని అనునయిస్తూ "కోపగించకు. కొత్తగా వచ్చిన వారి గుణ శీలములు తెలియవు కదా. అందువలన ఆ విధముగా పరుషంగా మాట్లాడినాను. ఇకనుంచి నీవు నా వద్దకు రావచ్చు..... పోవచ్చు. నీకు అడ్డులేదు " అన్నది. పిల్లి ఎంతోషంతోషించింది.


పిల్లి గద్దతో స్నేహం చేయసాగింది. కొద్ది రోజులు గడిచాయి. పిల్లి గద్దను పూర్తిగా నమ్మింది. గద్దతో పాటు తొఱ్ఱలో ఉండసాగింది. అర్థరాత్రి సమయంలో చప్పుడు చేయకుండా చెట్టెక్కి పక్షి పిల్లల గొంతును కొఱికి, వాటిని చంపేది. పక్షిని తొఱ్ఱలోకి తెచ్చుకొని దానిని తిన్నది. ఈ విధంగా కొద్ది రోజులు జరిగాయి.


పక్షులు తమ పిల్లలు కనిపించక తల్లడిల్లాయి వాటికోసం వెదకసాగాయి. ఆ సంగతి తెలిసి పిల్లి పారి పోయింది. పక్షులు తమ పిల్లల కోసం వెతుకుతూ తోఱ్ఱ వద్దకు వచ్చాయి. తొఱ్ఱలో పక్షులు ఎముకలను చూసి , గద్దయే తమ పిల్లలను చంపి తింటున్నదని అనుకున్నాయి. అవి కోపంతో గద్దను తమ గోళ్ళతో రక్కి దానిని చంపాయి. "నీచులతో స్నేహం చేస్తే చివరకు తమ ప్రాణాలకే ముప్పు వస్తుందని" అనుకుంటూ గద్ద చని పోయింది

పొగడ్తలకు లొంగిపోయినవారు ఎప్పటికైనా ఇబ్బందులపాలు కాక తప్పద

అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది పరమ పిసినారి. ఒకసారి దానికి ఒక మాంసం ముక్క దొరికింది. దానిని ఏ వీధి అరుగుమీదో, ఏ చెత్తకుండీచాటునో కూర్చుని తినచ్చు కదా! ఊహూ... తోటి నక్కలు చూస్తే తమకూ కాస్త పెట్టమంటాయని దాని భయం. ఎందుకంటే అది ఎప్పుడూ మిగతా నక్కల దగ్గర ఆహారం అడిగి తినేది. అందుకే ఆ మాంసం ముక్కను తీసుకుని చాటుగా ఊరవతలికి బయలుదేరింది. 


ఊరవతల ఒక చెట్టు మీద ఉన్న రెండు కాకులు కుక్క నోట్లో ఉన్న మాంసం ముక్కను చూశాయి. దొరికిన ఆహారాన్ని కలిసి పంచుకుని తినే కాకులు కుక్క దగ్గర్నుంచి ఎలాగైనా సరే మాంసం ముక్కను కొట్టేయాలి అనుకున్నాయి. అందుకని అవి నక్క ముందు వాలి స్నేహంగా కబుర్లు చెప్పడం మొదలు పెట్టాయి.

 

‘‘క్క మామా! క్క మామా! బాగున్నావా? ఊరిలో నుంచి వస్తున్నావు, ఏమిటి సంగతులు?’’ అని ఒక కాకి అడిగింది. క్క ఏమీ లేవన్నట్టు తల అడ్డంగా ఊపింది.‘‘నువ్వు మేలుజాతి క్కలా ఉన్నావు. నీలాంటి క్కను ఇంతకు ముందు మేమెన్నడూ చూడలేదు. నీతో స్నేహం చేయాలని ఉంది. చేస్తావా?’’ అంటూ పొగిడాయి. కాకుల పొగడ్తలకు పొంగిపోయిన క్క ‘సరే’ అని తలూపింది.

వెంటనే రెండు కాకులూ సంతోషంగా అరుస్తూ నక్క చుట్టూ తిరుగుతూ ఆడుకోసాగాయి. ఒక కాకి నక్క వెనుకకు, మరొక కాకి నక్క ముందుకు చేరాయి. వెనుకనున్న కాకి హఠాత్తుగా నక్క తోక పట్టి లాగింది. ఉలిక్కిపడిన నక్క మాంసపు ముక్కను నేల మీద పెట్టి వెనక్కి తిరిగి చూసింది. ఇంతలో ముందు వైపు ఉన్న కాకి ఆ మాంసపు ముక్కను నోటితో కరుచుకుని రివ్వున ఎగిరి వెళ్ళిపోయింది. పనైపోయిందిగా, ఇక రెండో కాకి కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది. రెండూ చెట్టు మీద కూర్చుని మాంసం ముక్కను పంచుకుని తిన్నాయి. పాపం ఆ నక్క నోటమాటరాక అలా చూస్తూ ఉండిపోయింది.

జిత్తులమారి నక్క

అనగనగా ఒక పెద్ద అడవి. అందులో ఒక నక్క ఉండేది. అది మహా జిత్తులమారి. అది ఓసారి సరదాగా షికారుకు బయల్దేరింది. అలా వెళ్తూ వెళ్తూ కాలు జారి, ఓ పాడుబడిన బావిలో పడిపోయింది. అది కాస్త లోతుగా ఉండటంతో బయటికెలా రావాలో అర్థం కాలేదు. పైకి ఎగిరింది. గోడ ఎక్కాలని ప్రయత్నించింది. ఏం చేసినా పైకి రాలేకపోయింది. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా అక్కడికి ఓ మేక వచ్చింది.


మేక అసలే దాహంతో ఉంది. నీళ్లకోసం బావిలోకి తొంగి చూసింది. దానికి నక్క కనబడింది. అది అక్కడ ఏం చేస్తున్నదో తెలుసుకోకుండా -‘‘నక్క బావా, నక్క బావా! బావిలో బాగా నీళ్లున్నాయా’’ అని అడిగింది. బావిలోంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్న నక్కకు మంచి ఉపాయం తట్టింది.


‘‘ఓ.. లేకేం! ఎంత తోడినా తరగనన్ని నీళ్లున్నాయి. వచ్చి తాగు’’ అంది. మంచి దాహంతో ఉన్న మేక, వెనకా ముందూ ఆలోచించకుండా బావిలో దూకేసింది. అప్పుడుగానీ దానికర్థం కాలేదు. ‘‘అయ్యో, ఇందులోంచి బయటికెలా వెళ్లడం’’ అంది దిగులుగా. అందుకు నక్క- ‘‘మనం బయటపడటానికి నేనో మంచి మార్గం చెప్తాను. నువ్వు నీ ముందర కాళ్లు ఎత్తి, గోడకు ఆన్చి నిలబడు. నేను నీ మీద ఎక్కి పైకి వెళ్లిపోతాను. తర్వాత నువ్వూ వచ్చేద్దువు గాని’’ అంది.

నక్క మాటల్లోని మర్మం గ్రహించని మేక నక్క చెప్పినట్టే నిలబడింది. దాని మీద ఎక్కి ఎంచక్కా పైకి వచ్చేసింది నక్క. ‘‘మరి నేను...’’అంది మేక. ‘‘ఏమో... నాకేం తెలుసు’’ నిర్లక్ష్యంగా అంది నక్క.అప్పుడర్థమయ్యింది మేకకు నక్క చేసిన మోసం. ‘‘నన్నిలా మోసం చేయడం నీకు తగదు’’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.  ‘‘ఇందులో నా తప్పేముంది! నేను చెప్పగానే బావిలోకి దూకేయడం నీదే తప్పు. నీకు నువ్వే కష్టాలు కొని తెచ్చుకుని నన్నంటావేం’’ అంటూ చక్కా పోయింది. మంచి చెడులు ఆలోచించకుండా ఇతరులను గుడ్డిగా నమ్మేయడం ఎంత తప్పో తెలిసొచ్చింది మేకకి.

అందని ద్రాక్ష పుల్లన

అనగనగా ఒక నక్క ఉండేదట, ఒక రోజు అది  రైతు యెక్క ద్రాక్ష తోటలోకి ప్రవేశించింది. అక్కడ దానికి ఎత్తయిన పందిళ్ళకు చక్కటి ద్రాక్షలు వేలాడుతూ కనపడ్డాయి. ఆ పండిన ద్రాక్షలను చూసిన నక్కకు నోరూరి, ఎట్లాగయినా సరే ఆ పళ్ళను తినాలని నిర్ణయించుకున్నది.


 మామూలుగా అయితే నక్కకు ఆ పళ్ళు అందవు. అందుకని, అది తన ముందు కాళ్ళ మీద లేచి వాటిని అందుకోబోయింది. కానీ, దానికి ద్రాక్ష పళ్ళు అందలేదు. ఆపైన నక్క ఎగిరి అందుకోవాలని తెగ ఆరాటపడింది. ఎంత ఎగిరినా దానికి ఆయాసం వచ్చింది కానీ, ద్రాక్షపళ్ళు మాత్రం అందలేదు. ఎగిరి, ఎగిరి ఆయాసంతో ఇక ఎగరలేక విసిగి,"ఛీ ఛీ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయట నేను తినడమేమిటి?" అని గొణుక్కుంటూ వెళ్ళిపోయింది


 అలాగే, ఎవరైనా ఏదో పొందాలని ప్రయత్నించి ఆశాభంగం చెందినపుడు, అప్పటివరకు దేని కోసం అయితే తీవ్ర ప్రయత్నం చేశారో దాన్నే చెత్తది, పనికిరానిది అని అన్నపుడు అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అని నలుగురు నవ్వుకుంటారు.

చెరపకురా... చెడేవు!

ఒక ఊరిలో వృద్ధ సాధువు ఉండేవాడు. ఆయన ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్ళి భిక్ష తెచ్చుకుని కాలం వెళ్లదీసేవాడు. ఆయనకున్న దయాగుణం, మంచిమనసు వల్ల ప్రజలకు సాధువు వచ్చేసరికే ఆయన కోసం ఆహారం సిద్ధం చేసి ఉండేవారు.


సాధువు తాను భిక్షగా స్వీకరించిన ఆహారంలో నుండి పేదవారికి, బిచ్చగాళ్లకు, దారినపోయే బాటసారులకు పంచి మిగిలినది తినేవాడు. కొన్నిసార్లు ఆహారమంతా ఇతరలకు పంచి పస్తులుండేవాడు.

ఒకరోజు ఆ సాధువు ఒక వృద్ధురాలి ఇంటికి భిక్ష స్వీకరించడానికి వెళ్ళాడు. ఆ వృద్ధురాలు చాలా పిసినారి, దుర్మార్గురాలు, ఎవరికీ భిక్ష పెట్టేది కాదు. అయినా సాధువును వదిలించుకోడానికి కొంత ఆహారం భిక్ష వేసింది. మరునాడు కూడా సాధువు ఆ ఇంటికి భిక్ష కోసం రాగా, పాడైపోయిన అన్నం పెట్టింది. మూడోరోజు సాధువు వృద్ధురాలి ఇంటి దగ్గరకు రాగానే, అతని బెడద వదిలించుకునేందుకు. ఆమె ఒక దుర్మార్గపు పన్నగం పన్నింది.

వంటగదిలోకి వెళ్ళి విషం కలిపిన అన్నం తీసుకువచ్చి పెట్టింది. ఆ అన్నాన్ని స్వీకరించిన సాధువు అటూ ఇటూ తిరిగి సాయంత్రానికి తన ఇంటికి చేరుకున్నాడు. అన్నం తిందామని తన ఇంటి వాకిట్లో కూర్చొగానే ఒక యువకుడు అలసటగా రొప్పుతూ నడుస్తున్నాడు. వెంటనే సాధువు ఆ యువకుడిని పిలిచి, "అలసటగా ఉన్నట్టున్నావు. కాస్త అన్నం తిను. కాస్సేపు కూర్చుని వెళ్ళు" అని అతనికి వృద్ధురాలు పెట్టిన అన్నం మొత్తం పెట్టేశాడు. దురదృష్టవశాత్తు ఆ యువకుడు వృద్ధురాలి కొడుకే.

ఆకలిగా ఉన్న ఆ యువకుడు వెంటనే గబగబా అన్నం తిని తన ఇంటికి బయల్దేరాడు. ఇల్లు చేరుకునే సరికి తలతిరుగుతున్నట్లు అనిపించింది. వెంటనే నురగలు కక్కుతూ తల్లి ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు. కొడుకు నుంచి విషయం తెలుసుకున్న తల్లి లబోదిబోమంది. ఆ యువకుడినే అనుసరిస్తూ వచ్చిన సాధువు తనకు తెలిసిన విద్యతో అతణ్ణి బతికించాడు. అప్పుడు వృద్ధురాలు ఏడుస్తూ తన తప్పును క్షమించమని సాధువు కాళ్ళమీద పడింది. అప్పటినుంచి జీవితాంతం మంచి తనంతో మెలిగింది.

కుటిలత్వానికి తానేకాక తనవారు కూడా బలవుతారు

వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యపాలన చేస్తుంటే బోధిసత్వుడు వైశ్యకులంలో పుట్టాడు. అతనికి పండితుడని పేరు పెట్టారు. అతను పెద్దవాడయ్యాక మరో వర్తకుడితో కలిసి వ్యాపారం చెయ్యసాగారు. ఆ వ్యాపారి పేరు అతిపండితుడు. వాళ్ళిద్దరూ పై వూళ్ళు వెళ్ళి వ్యాపారం చేసి లాభంతో తిరిగి వచ్చారు. లాభం పంచుకునే సమయంలో ' నాకు రెండువంతులు రావాలి ' అన్నాడు అతి పండితుడు. ' ఎందుకని?' అడిగాడు బోధిసత్వుడు (పండితుడు) ఆశ్చర్యపడుతూ. అందుకతడు ' నువ్వు పండితుడివి మాత్రమే నేను అతిపండితుడిని కదా! అందుకు ' అన్నాడు.

'సరుకులూ... ఎద్దులూ... బళ్ళూ మనవి సమాన భాగాలు కదా? నీకు రెండువంతులెందుకు రావాలి?' అడిగాడు పండితుడు. 'అతిపండితుడిని అవడంవల్ల' అన్నాడతను. వారి దెబ్బలాట ముదిరింది. అప్పుడు అతిపండితుడు దీనికొక ఉపాయముంది. నాకు రెండు భాగములు వచ్చుట న్యాయమోకాదో వృక్షదేవత చెప్పును. రేపు వృక్షదేవతనే అడుగుదాం. అది చెప్పినట్లే చేద్దాం. మనలో మనకి తగవెందుకు? అన్నాడు.

ఆ రాత్రి అతిపండితుడు తన తండ్రినొక చెట్టు తొర్రలో పెట్టి "మేము రేపు వచ్చి అడిగినప్పుడు ' అతి పండితుడు రెండు భాగములకు అర్హుడు అని చెప్పు ' అంటూ ఆదేశమిచ్చాడు. మర్నాడు అతిపండితుడు, పండితుని వృక్షము వద్దకు కొనిపోయి వృక్షదేవతా! మాతగవు తీర్చుము. అందుకు నువ్వే తగినదానవు" అన్నాడు. సంగతి చెప్పండి అన్నాడు తొర్రలో ఉన్న అతను గొంతుకను కొంత మార్చి. ఇతను పండితుడు, నేనో అతి పండితుడిని. అని మొదలుపెట్టి జరిగినదంతా వృక్షానికి విన్నవించాడు అతి పండితుడు. మా వ్యాపారంలో వచ్చిన లాభంతో ఎవరెవరికెంత రావాలో సెలవియ్యి అన్నాడు చివరగా.

పండితునకొక భాగము, అతిపండితునకు రెండు భాగములు అని వినిపించింది చెట్టులోంచి. అప్పుడు పండితునిగా ఉన్న బోధిసత్వుడు దేవతా రూపమో మరొకటో యిప్పుడు బయటపడుతుంది అంటూ ఎండుగడ్డి తెచ్చి చెట్టు తొర్రలో వేసి నిప్పంటించాడు. అగ్నిజ్వాలలు వ్యాపించే సరికి అతిపండితుని తండ్రి సగం ఒళ్ళు కాలి కుయ్యో మొర్రో మంటూ బయటకు వచ్చి పండితునిగా ఉండడమే మంచిది. అతిపండితుడవడం చాలా హానికరం. నాకొడుకు అతి పండితుడు కాబట్టి నన్ను అగ్నిపాలు చేశాడు. అని మీరిద్దరూ సమాన భాగాలు చేసుకోవడమే న్యాయం. అని చెప్పాడు. ఇద్దరూ వ్యాపారంలో లాభాలను సమంగా పంచుకున్నారు.

 

మిత్రలాభము కంటే మించిన లాభము లేదు

పూర్వం గోదావరి నదీ తీరంలో ఓ పెద్ద బూరుగు చెట్టు ఉండేది. ఆకాశమును తాకుచున్నదా అన్నంత ఎత్తుగా విశాలంగా పరుచుకున్న కొమ్మలతో కళకళలాడుతూ ఉండే ఆ చెట్టు మీద ఎన్నో రకాల పక్షులు గూళ్ళు కట్టుకుని జీవిస్తున్నాయి. ఒకరోజు ఉదయం ఆ చెట్టు మీద నివసిస్తున్న 'లఘుపతనక' అనే కాకి నిద్రలేస్తూనే కిందకు చూచింది. ఆ చెట్టుకు కొద్ది దూరంలో ఒక వేటగాడు నూకలు చల్లి వలపన్నుతూ కనిపించగానే దానికి భయం వేసింది.

'అయ్యో! పొద్దున్నే నిద్రలేస్తూనే ఈ పాపాత్ముడి మొహం చూసాను. ఈ రోజు నాకు ఏ ఆపద రానున్నదో...' అనుకుంటూ ఆ చెట్టు మీద నుండి రివ్వున ఎగిరిపోయి కొద్ది దూరంలో ఉన్న మరొక చెట్టుపైన వాలి ఆ వేటగాడిని గమనించసాగింది. వల పన్నటం పూర్తిచేసిన వేటగాడు ఆక్కడికి దగ్గరలోనే ఉన్న ఓ పొదలో దాక్కుని వలలో పక్షులు ఎప్పుడు చిక్కుకుంటాయా అని ఎదురుచూస్తున్నాడు.

ఆకాశంలో ఆ చెట్టు వైపుగా ఓ పావురాల గుంపు ఎగురుకుంటూ రాసాగాయి. ఆ పావురాల గుంపుకు 'చిత్రగ్రీవుడు' అనే పావురం రాజు. ఆ బూరుగు చెట్టు దగ్గరకు వస్తూనే ఆకాశంలోంచి నేలమీద వేటగాడు చల్లిన నూకలను గమనించిన చిత్రగ్రీవుడు మిగిలిన పావురములతో 'మిత్రులారా! మనుషులు తిరగని ఈ చోటులో నూకలు ఉన్నాయి కనుక వీటి వెనుక ఏదో మర్మము ఉండి ఉంటుంది. బహుశా ఏ వేటగాడో మనలాంటి పక్షులకోసం పన్నిన వల అయి ఉండవచ్చు. అందుకని మనం ఈ నూకల కోసం ఆశపడి ఆపదను కొనితెచ్చుకోవద్దు' అంటూ హెచ్చరించాడు.

ఆ గుంపులో ఉన్నా ఓ ముసలిపావురం చిత్రగ్రీవుడి మాటలకు నవ్వి 'చిత్రగ్రీవా! నీవు రాజువి అన్న అహంకారం వదిలి నేను చెప్పే మాటలను శాంతంగా విను. అనవసరమైన అనుమానాలతో ఎదుట ఉన్న ఆహారమును కాలదన్నుకొనుట మూర్ఖత్వము. నువ్వే చెప్పావుగా ఈ ప్రదేశములో మనుషులు తిరగరని. మరి ఇలాంటి చోట నూకలు ఉండటం అనుమానించతగ్గ విషయం ఏ మాత్రం కాదు. ఆ బూరుగు చెట్టుమీద నివసించే పక్షులు ఆహారం తెచ్చుకున్నప్పుడు ఆ నూకలు వాటి నుంచి జారిపడి ఉంటాయి. అందుచేత అవితినటానికి మనం క్రిందకు దిగుదాం!' అంటూ చిత్రగ్రీవుడి హెచ్చరికకు అభ్యంతరం చెప్పింది.

ఆ ముసలి పావురం మాటలకు మిగిలిన పావురములు వంత పాడుతున్నట్లుగా ఉండటంతో చిత్రగ్రీవుడు తన మాటలతో ఆ పావురముల మనసు మార్చుట కష్టమని గ్రహించి మౌనంగా ఉండిపోయాడు. చిత్రగ్రీవుడి మౌనం అర్ధాంగీకారంగా భావించిన పావురములన్ని నూకలను తినటానికి నేలమీద వాలి వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయాయి.

చిత్రగ్రీవుడి మాట వినకుండా ముసలిపావురం మాట విని నూకలకు ఆశపడి ప్రాణాలు మీదకు తెచ్చుకున్నందుకు ఏడుస్తూ ముసలి పావురాన్ని మిగిలిన పావురాలన్నీ కోపంతో తిట్టసాగాయి. చిత్రగ్రీవుడు ఆ పావురాలన్నింటినీ ఓదారిస్తూ 'మిత్రులారా! వివేకవంతుడు కూడా ఒక్కొక్క సారి ఆవేశంవల్ల, దురాశ వల్ల ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. ఇప్పుడు మనలో మనం గొడవపడితే మంచిదికాదు' అన్నాడు. చిత్రగ్రీవుడి మాటలకు మిగిలిన పావురాలన్ని శాంతించాయి. వలకు కొద్ది దూరంలో ఉన్న పొదలో దాక్కున్న వేటగాడు వలలో చిక్కుకున్న పావురములను చూసి 'ఆహ! పొద్దున్నే ఎవరి మొహం చూసానోగానీ... ఈ రోజు నా పంట పండింది' అనుకుంటూ పొదలోంచి లేచి వలవైపు రాసాగాడు.

వేటగాడిని చిత్రగ్రీవుడు గమనించి 'మిత్రులారా! వేటగాడు వస్తున్నాడు. మనమందరం ఒక్కసారి బలంగా ఆకాశంలోకి ఎగురుదాం అప్పుడు వలతో సహా వేటగాడికి దొరకకుండా ఈ ఆపదను తప్పించుకుంటాం. ఆ తరువాత గండకీ నది ఒడ్డున ఉన్న అడవిలో హిరణ్యకుడు అనే ఎలుక ఉన్నది అతను నాకు మంచి మిత్రుడు, అతని దగ్గరకు వెడదాం ఈ వలను కొరికి మనల్ని రక్షిస్తాడు' అని మిగిలిన పావురములతో చెప్పాడు. చిత్రగ్రీవుడి ఉపాయానికి మిగిలిన పావురాలన్నీ సంతోషించాయి. వేటగాడికి దొరకకుండా తప్పించుకునే మార్గం దొరికినందుకు వాటికి కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. పావురాలన్నీ ఒక్కసారిగా రెక్కలను టపటపాలాడించాయి. రివ్వుమంటూ వలతో సహా ఆకాశంలోకి వేగంగా ఎగిరిపోయాయి.

వలలో చిక్కుకుని గింజుకుంటున్న పావురాలు ఎక్కడకి పోతాయిలే అని తాపీగా వస్తున్న వేటగాడు ఒక్కసారిగా పావురములన్ని ఆకాశంలోకి ఎగరిపోవటం చూసి కొయ్య బారి పోయాడి. వెంటనే తెలివితెచ్చుకుని ఆకాశంలో పావురాలు ఎగురుతున్న దిక్కువైపు నేలమీద పరుగుపెట్టి కొంత దూరం వెళ్ళి ఆయాసంతో ఆగిపోయి ఇక ముందుకు వెళ్ళలేక తన దురదృష్టానికి ఏడుస్తూ ఇంటి దారి పట్టాడు. పావురములన్ని ఎక్కడా ఆగకుండా ఎగురుతూ విచిత్రవనంలో హిరణ్యకుడు నివశిస్తున్న చెట్టు దగ్గర వాలాయి. పావురముల రెక్కల శబ్ధమునకు భయపడిన హిరణ్యకుడు చెట్టుతొర్రలోపలికి దూరిపోయి భయంతో కూర్చున్నాడు. అప్పుడు చిత్రగ్రీవుడు 'మిత్రమా! నేను చిత్రగ్రీవుడిని' అని చెప్పగానే హిరణ్యకుడు వేగంగా బయటకు వచ్చి చిత్రగ్రీవుడిని చూసి ఆనందపడి ఆ తరువాత చిత్రగ్రీవుడితో పాటు మిగిలిన పావురాలన్ని కూడా వేటగాడు పన్నిన వలలో చిక్కుకున్నాయని తెలుసుకుని బాధ పడ్డాడు.

చిత్రగ్రీవుడు హిరణ్యకుడిని చూసి ఆనందపడి 'మిత్రమా! స్నేహితుడు ఆపదలో ఉన్నపుడు బాధపడేవాడే నిజమైన మిత్రుడు. అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. ఈ వలతాళ్ళను కొరికి మమ్మల్ని రక్షించు' అన్నాడు. చిత్రగ్రీవుడు మాటలకు హిరణ్యకుడు ఆనందిస్తూ 'మిత్రమా! నీ కోరిక తప్పక మన్నిస్తాను. కాకపోతే నా పళ్ళు చాలా సున్నితమైనవి కనుక ముందు నీ కాళ్ళకున్న తాళ్ళను కొరుకుతాను' అన్నాడు. హిరణ్యకుడి మాటలకు చిత్రగ్రీవుడు నవ్వి... ' అలాగే కానివ్వు మిత్రమా! కాకపోతే ముందుగా ఈ పావురములకున్న తాళ్ళను కొరికి ఆ తరువాత నా కాళ్ళకున్న తాళ్ళను కొరుకు' అన్నాడు.

'చిత్రగ్రీవా! తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డబేరము' అన్నాడు హిరణ్యకుడు. 'హిరణ్యకా... మనలని నమ్మిన వారిని రక్షించుట మన ధర్మం. అదే న్యాయం, అందుకే ముందు ఈ పావురాలని రక్షించి ఆ తరువాత నన్ను రక్షించు. 'చిత్రగ్రీవుడి మాటలకు నిజమును గ్రహించిన హిరణ్యకుడు తన పళ్ళతో అన్ని పావురముల బంధములను కొరికి వాటిని రక్షించెను.

చూసారా! ప్రతివారికీ అపద సమయంలో ఆదుకొనుటకు ఓ మంచి మిత్రుడు ఉండాలి. 'మిత్రలాభము కంటే మించిన లాభము లేదు' అన్నది ఈ కధలోని నీతి. నాలుగు రూపాయలను వెనకేసుకోవటం కంటే నలుగురు మిత్రులను సంపాయించుకున్నవాడే నిజమైన ధనవంతుడు, గుణవంతుడు అని చెప్పటం కూడా ఈ కధలోని ఉద్దేశం.

ఐకమత్యమే బలం

పూర్వకాలం ఉజ్జయినీ నగరంలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతను చాలా తెలివిగా వ్యాపారం చేస్తూ బాగా డబ్బు, పేరు సంపాదించుకున్నాడు. అన్నీ ఉన్నా అతనికి ఉన్న దిగులు ఒక్కటే. అది తన పిల్లల గురించే. అతని నలుగురు పిల్లలు పుట్టటంతోనే ధనవంతులు కావడం వల్ల అల్లారు ముద్దుగా పెరిగారు. ఎవరికీ చదువు అబ్బలేదు. ఇతరులు అంటే నిర్లక్ష్యం. లోకజ్ఞానం లేదు. పైగా ఒకరంటే ఒకరికి పడదు. వారికి వయస్సు పైబడుతున్నా ఏమాత్రం మార్పు రావడంలేదు. కొంత కాలానికి షావుకారికి జబ్బు చేసింది. చనిపోతానేమోనని బెంగపట్టుకుంది.తను చనిపోతే తన పిల్లలు ఎలా బ్రతుకుతారా అని దిగులుతో వ్యాధి మరింత ఎక్కువైంది. బాగా ఆలోచించగా అతని ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది.

నలుగురు కొడుకులను పిలిచి వాళ్ళతో కొన్ని కట్టెలు తెప్పించాడు. ఒక్కొక్కడిని ఒక్కొక్క కట్టె తీసుకొని విరవమన్నాడు. నలుగురు తలో కట్టెను తీసుకుని సునాయాసంగా మధ్యకు విరిచేసారు. తరువాత ఒకేసారి రెండేసి కట్టెలను విరవమన్నాడు. ఆ నలుగురు వాటిని కష్టం మీద విరిచారు. తరువాత ఒక్కొక్కరినీ నాలుగేసి కట్టెలు తీసుకుని విరవమన్నాడు షావుకారు. నాలుగేసి కట్టెలు విరవడం ఏ ఒక్కరి వల్లనా సాధ్యం కాలేదు. అవే నాలుగు కట్టెలను నలుగురిని పట్టుకుని విరవమన్నాడు.నలుగురూ కలిసి నాలుగు కట్టెలను నునాయాసంగా విరిచేశారు. చూశారా మీరు కలిసి కట్టుగా ఒక పని చెయ్యగలిగారు. ఎవరికి వారు చేయలేకపోయారు. "ఐకమత్యమేబలం" కాబట్టి నా తదనంతరం మీరు ఐకమత్యంగా ఉంటామని ప్రమాణం చేయండి అన్నాడు తండ్రి. నలుగురూ తండ్రి మాటల్లోని సత్యాన్ని గ్రహించి అలాగేనని తండ్రికి ప్రమాణం చేశారు.

హాస్యానికైనా అబద్దం ఆడరాదు

ఒక ఊరిలో సోమయ్య అనే పల్లెటూరి రైతు ఉన్నాడు. అతనికి పొలం ఉంది. గొర్రెల మంద కూడా ఉంది. కూలీలతో ఒక రోజు మందని తోలుకొని వెళుతూ తన కొడుకు రంగడుని కూడా పొలానికి తీసుకుని వెళ్ళాడు.మందకి కొడుకుని కాపలా ఉండమని చెప్పాడు. సరే అన్నాడు రంగడు. 'ఇక్కడ అప్పుడప్పుడు పెద్ద పులి వస్తూ ఉంటుంది జాగ్రతా అని హెచ్చరించి, 'ఒక వేళ పులి వస్తే కేకలు వేయమని చెప్పి తాను పొలంలోని కూలీలతో పనులు చేయించటంలో నిమగ్నమయ్యాడు సోమయ్య. రంగడు ఆకతాయి కుర్రాడు. తండ్రిని ఒక ఆట పట్టించాలని అనుకున్నాడు. 'నాన్న నాన్న పులి వచిందీ అని పెద్దగా అరిచాడు నిజంగా పులి వచిందేమో అని సోమయ్య కూలీలతోనూ కర్రలతోనూ పరుగెత్తుకు వచ్చాడు.


కాని రంగడు నవ్వూతూ 'పులీ లేదు గిలీ లేదు హాస్యానికి కేకలువేశాడు అన్నాడు. సోమయ్య, కూలీలు వెళ్ళిపోయారు. మళ్ళీ కాసేపటికి నాన్నా నాన్న పులి అని అరిచాడు. సోమయ్య వాళ్ళు మరొకసారి వచ్చారు. ఈసారి కూడా వేళాకోళమే' అన్నాడు రంగడు. సోమయ్య రంగడ్ని కోప్పడి వేళ్ళి పోయ్యారు.


మరి కొద్ది సేపటికి పులి నిజాంగానే వచ్చింది. ఈసారి మళ్ళీ 'నాన్నా నాన్నా పులీ అని గట్టిగా అరిచాడు. ఎంత అరచినా సోమయ్య వాళ్ళు వినిపించుకో లేదు హాస్యానికే మళ్ళా రంగడు అరిచాడని లెక్క చేయలేదు. పులి మాత్రం గొర్రె పిల్ల నొకదాన్ని మెడ పట్టుకొని ఈడ్చుకుపోయింది. రంగడు ఏడుస్తూ నవ్వులాటకి అబద్ధమాడితే అపాయం ముంచుస్తుంచని తెలుసుకున్నాడు.

అపాయానికి ఉపాయము

అపాయానికి ఉపాయము ఎంత ముఖ్యమో, ఉపాయానికి అపాయము లేకుండా జాగ్రత్త పడటం అంతే ముఖ్యము.
ఉపాయములో ఎలాంటి అపాయమున్నా తప్పించుకోవచ్చు. తెలివి, ఆలోచన సమయస్ఫూర్తి ఉంటే శత్రువును ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీరు త్రాగించవచ్చు. అలా సింహాన్ని చంపిన చిన్న కుందేలు కథ.


అరణ్యంలో ఎన్నో రకాల జంతువులు నివసిస్తున్నాయి. అన్నింటికి రాజు సింహం. అది చాల పౌరుషము కలది. తన పంతం చెల్లాలనే పట్టుదల కలది. పై పెచ్చు క్రూర స్వభావమున్నది. అందుచేత అది ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతోంది. అది ఇష్టము వచ్చినట్లు వేటాడి జంతువుల్ని చంపి తినేది. జంతువుల శవాల్ని పోగులు పెట్టేది. ఆ సింహం వేటకు బయలుదేరితే జంతువులన్నీ ప్రాణరక్షణ కోసం పరుగు తీసేవి. సింహం ఇష్టం వచ్చినట్లు చంపటం వల్ల అన్నీ కలిసి ఆలోచించి రోజుకు ఒకరు చొప్పున ఆహారంగా వెళ్ళాలని తీర్మానించుకుని, సింహానికి తెలియజేయగా సింహం అంగీకరించింది.


కష్టపడకుండా నోటి దగ్గరికి ఆహారము రావటంవలన దానికి బాగానే ఉంది. జంతువులు తమ వంతు ప్రకారము ఆహారముగా వెళుతున్నాయి. చిన్న కుందేలు వంతు వచ్చింది. మూడు సంవత్సరాలు నిండిన తనకి అప్పుడే ఆయుర్దాయము చెల్లిపోయిందని బాధపడింది. అయితే కుందేలు మిగతా జంతువుల వలె గాక తెలివిగలది, ఆలోచించగలిగింది. ఉపాయముతో అపాయము తప్పించుకోవాలని ఆలోచించసాగింది. దానికి ఉపాయము తోచింది. వెంటనే ఆచరణలో పెట్టింది. సింహం దగ్గరకు ఆలస్యంగా వెళ్ళింది. సింహం వేళ దాటి పోతున్నందున కుందేలు పై మండిపడి 'ఇంత ఆలస్యము ఎందుకు జరిగింది?' అని భయంకరంగా గర్జించింది. అప్పుడు కుందేలు వినయం, భయం, భక్తితో నమస్కరించి ఇలా అంది.


"మహారాజా! నేను మామూలు వేళకు బయలు దేరాను దారిలో మరో సింహం కనిపించి నన్ను నిలదీసి గర్జించింది. తానే ఈ అడవికి మహారాజు, మరొకడు రాజు కాడు అని నన్ను తనకు ఆహారము కమ్మన్నది. నేను అతి కష్టము మీద ఒప్పించి మీ దర్శనము చేసుకుని తిరిగి వస్తానని చెప్పి వచ్చాను.


"ప్రభూ! ఆ సింహం మిమ్మల్ని ఎంతగానో దూషించింది. మీకు పౌరుషం లేదన్నది గాజులు వేసుకోమని" చెప్పింది. మిమ్మల్ని వెక్కిరించింది. ఈ మాటలు చెప్పి కుందేలు సింహం వైపు చూసింది అప్పటికే సింహానికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే కోపంగా "నేనే ఈ అడవికి రాజుని" ఎక్కడో చూపించు దానిని నా పంజాతో కొట్టి చంపేస్తా" నంటూ ఆవేశముగా కుందేలు వెంట నడిచింది. కుందేలుని తొందర చేసి బయలుదేరిన వారిరువురు పాడు బడిన బావి దగ్గరకు వచ్చారు. శత్రుసింహానికై వెదక సాగింది. ఇక ఆలస్యం చేయక కుందేలు ఇలా చెప్పింది. "మహారాజా! మిమ్మల్ని వెక్కిరించి, దూషించిన సింహం ఆనూతిలో ఉంది. వెళ్ళి చంపండి". అంది.


కుందేలు మాటలకి సింహం గర్జించి నూతి గట్టుపైకి దూకి లోపలి చూసింది ఈ సింహం గర్జించగానే ఆ సింహం గర్జించింది. ఈ సింహం పంజా పై కెత్తగానే ఆ సింహం పంజా పైకెత్తింది ఈ సింహం ఏంచేస్తే అది అలా చేయసాగింది. సింహానికి కోపం ఎక్కువై నూతి గట్టు మీద నుండి నూతిలోకి దూకింది అంతే నీటిలో మునిగి చచ్చిపోయింది. ఆ నూతి నీటిలో తన నీడ పడి మరో సింహంలా కనిపించిందని కోపముతో ఉన్న అడవి రాజు పసికట్ట లేక పోయింది. కుందేలు పన్నిన ఉపాయం వలలో చిక్కుకుని సింహం చచ్చిపోయింది. అపాయానికి ఉపాయము ఉపయోగించి ప్రాణాలు కాపాడుకుంది చిన్న కుందేలు

బీర్బల్‌ కు పరీక్ష

వేసవి మండిపోతోంది. కణకణలాడే అగ్ని గోళంలా తొందరగా ఉదయించే సూర్యుడు బారెడు పైకెగబ్రాకేలోగా నిప్పులు చెరగడం ప్రారంభిస్తున్నాడు. అక్కడక్కడ నీటి చెలమలు తప్ప నదులు ఇసుక మేటల్లా కనిపించ సాగాయి. బావులు ఎండి పోయూయి. ఎండ తీవ్రతకు తట్టుకోలేక పగటి పూట వీధుల్లో తిరగడానికే జనం భయపడసాగారు. ఒకనాటి వేకువ సమయంలో అక్బర్‌ చక్రవర్తి వాహ్యాళికి బయలుదేరాడు. ఆయన వెంట ఎప్పటిలాగే బీర్బల్‌తో సహా మరి కొందరు ప్రముఖులు కూడా ఉన్నారు. కొంతసేపు నడిచాక, ‘‘ఇప్పుడే వేడి ఆరంభమవుతున్నది. బావులన్నీ ఎండిపోతున్నాయి,'' అంటూండగా అక్బర్‌ దృష్టి రహదారి పక్కనే ఉన్న ఒక బావి మీద పడింది. ‘‘ఆ బావిలో నీళ్ళున్నాయేమో చూద్దాం రండి,'' అంటూ వెళ్ళి ఆయన బావిలోకి తొంగి చూశాడు.

తక్కిన వారు కూడా ఆయన్ను అనుసరించి వెళ్ళారు. ‘‘బొట్టు నీళ్ళు లేవు,'' అంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు చక్రవర్తి. ‘‘వర్షాలు వచ్చేంతవరకు ఈ పరిస్థితి తప్పదు ప్రభూ! బావిలోకి ఏదైనా వేసి అది నేలను తాకుతుందా అని చూడడానికి ఇది అనువైన కాలం. నీళ్ళున్నప్పుడు వేస్తే అలా చూడలేము,'' అంటూ బీర్బల్‌ బాట పక్కనే ఉన్న చిన్నరాయిని తీసి బావిలోకి విసిరాడు.అది నేలను తాకిన శబ్దం ‘టప్‌'మని వినిపించింది.‘‘ఒకరాయికి తోడు మరొక రాయి కావాలి కదా,'' అంటూ చక్రవర్తి తన వేలికి ఉన్న వజ్రం పొదిగిన బంగారు ఉంగరాన్ని తీసి బావిలో వేశాడు. దాన్ని చూసి బీర్బల్‌ నివ్వెరపోయి, ‘‘ఒకరాయికి తోడు మరొక రాయి కావలసిందే. కాని, మామూలు రాయికి విలువైన వజ్రం తోడు కాజాలదు కదా?'' అన్నాడు.

చక్రవర్తికి తను చేసిన పొరబాటు తెలియ వచ్చింది. తొందరపడి ఆ పని చేసినట్టు గ్రహించాడు. సరే జరిగిందేదో జరిగిపోయింది. బావిలోకి దిగగల వారి చేత ఉంగరాన్ని వెలికి తీయిస్తే సరిపోతుంది, అని అనుకుంటూండగా ఆయనలో ఒక వింత ఆలోచన కలిగింది. ‘‘బీర్బల్‌, మనిషిని బావిలోకి దింపి ఉంగరాన్ని వెలుపలికి తీయించవచ్చు. అయితే...'' అంటూ ఆగాడు చక్రవర్తి. ‘‘ఏమిటో సెలవివ్వండి, ప్రభూ!'' అన్నారు బీర్బల్‌తో సహా అందరూ ముక్త కంఠంతో.
‘‘అయితే, బావిలోకి దిగకుండా పైనుంచే ఉంగరాన్ని ఎవరైనా వెలికి తీయగలరా?'' అని అడిగాడు చక్రవర్తి. ‘‘అసాధ్యం!'' అన్నాడు ఒక వృద్ధ ప్రముఖుడు. ‘‘అంటే, బావిలోకి దిగకుండా ఉంగరాన్ని వెలికి తీసే మార్గమే లేదంటారు. అంతే కదా?'' అని అడిగాడు చక్రవర్తి. ‘‘అంతే ప్రభూ. అందులో ఏమాత్రం సందేహం లేదు,'' అన్నాడు మరొక ప్రముఖుడు. ‘‘బీర్బల్‌, నీ అభిప్రాయమేమిటి?'' అంటూ బీర్బల్‌ కేసి తిరిగాడు చక్రవర్తి.

‘‘ఆ విషయంగానే ఆలోచిస్తున్నాను, ప్రభూ,'' అంటూ తలపాగా తీసి బుర్ర గోక్కో సాగాడు బీర్బల్‌. ‘‘బురగ్రోక్కున్నంత మాత్రాన పరిష్కార మార్గం తెలుస్తుందనుకుంటున్నాడు బీర్బల్‌,'' అన్నాడు ఒక ప్రముఖుడు హేళనగా. ‘‘అవును. నాకు తరచూ అలా జరుగుతుంది. నీకు జరగదేమో!'' అన్నాడు బీర్బల్‌. ‘‘నీకు మాత్రం ఎలా జరుగుతుంది?'' అని అడిగాడు ప్రముఖుడు. ‘‘బుర్ర ఉందిగనక! నీకు లేదు. ఆలోచన రావడం లేదు, అందుకునేనేం చేయను?'' అన్నాడు బీర్బల్‌. ఆ మాటకు చక్రవర్తితో సహా అందరూ గలగలా నవ్వారు. ‘‘ఆ.. చెప్పానా... బుర్ర గోక్కుంటే మంచి ఉపాయం తోస్తుందని. ఇప్పుడు ఉంగరాన్ని ఎలా వెలికి తీయూలో తెలిసిపోయింది,'' అన్నాడు బీర్బల్‌ ఉత్సాహంతో.
"ఎలా తీస్తావో చెప్పు,'' అని అడిగాడు చక్రవర్తిచాలా ఆత్రుతగా. ‘‘అందుకు కొంచెం సమయం కావాలి జహాపనా! అంతా సక్రమంగా జరిగితే సాయంకాలానికల్లా వెలికి తీయగలను. అంతవరకు నా పథకాన్ని రహస్యంగా ఉంచడం మంచిది,'' అన్నాడు బీర్బల్‌ వినయంగా. ‘‘ఇందులో తిరకాసు ఏదీ లేదు కదా!'' అన్నాడు ఇంతకు ముందు బీర్బల్‌ చేత అపహాస్యానికి గురైన ప్రముఖుడు.
‘‘అది నా నైజానికి విరుద్ధమైనది ప్రభూ! అయినా, ఆ పనిని సాధించే చక్కటి ఉపాయం ఉన్నప్పుడు, అడ్డుదారులతో నాకు పనేమిటి?'' అన్నాడు బీర్బల్‌ ఎంతో విశ్వాసంతో. ‘‘బావుంది. కాని ఇద్దరు భటులను కాపలా ఉంచడం ఎందుకైనా మంచిది ప్రభూ,'' అన్నాడు ప్రముఖుడు అంతటితో వదలిపెట్టకుండా. ‘‘బీర్బల్‌ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అయినా, నీ సలహాను కూడా పాటిస్తాను,'' అంటూ చక్రవర్తి ఎవరూ బావిలోకి దిగకుండా చూసుకోమని ఇద్దరు భటులను ఏర్పాటు చేసి వెళ్ళాడు.

అక్కడే ఉండిపోయిన బీర్బల్‌ చుట్టు పక్కల కలయచూశాడు. కొద్ది దూరంలో ఒక గుడిసె, దాని పక్కన చెట్టుకు కట్టబడిన ఒక ఆవు కనిపించాయి. బీర్బల్‌ చకాచకా గుడిసె వద్దకు వెళ్ళి, ‘‘లోపల ఎవరున్నారు?'' అని పిలిచాడు. వంగిన నడుముతో ఒక ముసలావిడ వెలుపలికివస్తూ, ‘‘ఏం, నాయనా ఏం కావాలి? నువ్వెవరు?'' అని అడిగింది. ‘‘అమ్మా, ఒక కడియ ఆవుపేడ కావాలి.కావాలంటే డబ్బిస్తాను,'' అంటూ దుస్తుల నుంచి చిల్లర తీశాడు. ‘‘ఆ భాగ్యానికి డబ్బెందుకు నాయనా. అదిగో ఆవు పేడ వేసింది చూడు. వెళ్ళి తీసుకో. అప్పుడే పొద్దెక్కి ఎండ కాల్చేస్తోంది,'' అంటూ గుడిసెలోపలికి వెళ్ళింది ముసలావిడ. బీర్బల్‌ ఎడమ చేత్తో పేడ కడియను తీసుకుని బావివద్దకు వచ్చి లోపలికి తొంగి చూశాడు. వజ్రపుటుంగరం తళ తళా మెరుస్తున్నది. ఉంగరాన్ని గురి చూసి పేడను ముద్దగా చేసి దాని మీదికి వేశాడు. సరిగ్గా అది ఉంగరం మీద పడింది. ఇప్పుడు ఉంగరం కనిపించడంలేదు.

బీర్బల్‌ తరవాత ఒక చిన్న రాయినీ, చేతా డంత పొడవాటి సన్నటి దారాన్నీ తీసుకున్నాడు. దారం ఒక కొసతో రాయిని గట్టిగా కట్టాడు. ఆ తరవాత రాయిని బావిలోని పేడ మీదికి గురి చూసి వదిలాడు. అది వెళ్ళి పేడమీద పడింది. బీర్బల్‌ సంతోషంగా దారం రెండవ కొసను బావికి పక్కనున్న ఒక మొక్కకు కట్టి, ‘‘మీరు ఇక్కడే దీనికి కాపలా కాస్తూ ఉండండి.
సాయంకాలానికి వస్తాను,'' అని భటులకు చెప్పి, అక్కడి నుంచి బయలుదేరాడు. ఎండ తీవ్రంగా ఉంది. అయినా అది తన పథకానికి చక్కగా ఉపయోగపడుతుందని బీర్బల్‌ సంతోషించాడు. సూర్యుడు అస్తమించడానికి గంటసేపు ఉందనగా బీర్బల్‌ బావిదగ్గరికి వెళ్ళాడు. మొక్కకు కట్టిన దారాన్ని చేతికి చుట్టుకుని, దారాన్ని బావి నుంచి జాగ్రత్తగా పైకి లాగసాగాడు. దారానికి కట్టిన రాయి, దాంతో పాటు రాయి చుట్టూ ఎండకు పిడకలా ఎండి పోయిన పేడ, పేడలోపలి చక్రవర్తి వజ్రపుటుంగరం పైకి రాసాగాయి.

బీర్బల్‌ పిడకను అందుకుని విరిచి చూశాడు. అందులో వజ్రపుటుంగరం కనిపించింది. దానిని శుభ్రంగా కడిగి దుస్తుల్లో దాచుకుని చక్రవర్తి దర్శనానికి బయలుదేరాడు బీర్బల్‌. రాజభవనం చేరేసరికి అక్కడ చక్రవర్తితో సహా పలువురు ప్రముఖులు కనిపించారు. ‘‘షహేన్‌షా!'' అంటూ బీర్బల్‌ వంగి సలాం చేశాడు. ‘‘ఉంగరం తెచ్చావా?'' అని అడిగాడు చక్రవర్తి. ‘‘తెచ్చాను. ఇదిగో, ఆలంపనా!'' అంటూ బీర్బల్‌ చక్రవర్తికి ఉంగరం అందించాడు వినయంగా. ‘‘ఎలా వెలికి తీశావు? ఇప్పుడు చెప్పు,'' అని అడిగాడు చక్రవర్తి. బీర్బల్‌ అంతా వివరించాడు. ‘‘వాహ్‌! వాహ్‌! నిజంగానే నువ్వు అందరికన్నా తెలివైనవాడివి బీర్బల్‌,'' అంటూ చక్రవర్తి అతడికి నాణాల సంచీని బహూకరించాడు. ‘‘ఆశ్రీతపోషణలో, దయూగుణంలో మీకు సాటిరాగల రాజులు భూప్రపంచంలోనే లేరు షహేన్‌షా!'' అంటూ బీర్బల్‌ నాణాలను అందుకుని చక్రవర్తికి మరోసారి సలాం చేశాడు.

తెలివైన దొంగ

ఒకనాటి చీకటివేళ ముగ్గురు దొంగలు, తాము నగరంలో దోచిన డబ్బూ, నగలతో అరణ్యం చేరి, అక్కడ పాడుబడిన గుడిలోని విగ్రహం వెనక దాన్ని దాచి, నిర్భయంగా మండపంలో కూర్చుని కబుర్లు చెప్పుకో సాగారు. మాటల మధ్యలో, వాళ్ళల్లో పెద్ద దొంగకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. వాడు మిగతా ఇద్దరితో, ``ఒరే, నే చెప్పేది జాగ్రత్తగా వినండి! ఇప్పుడు మనం దాచిన ధనం తలాకాస్తా పంచుకుంటే మనలో ఎవడి దరిద్రమూ తీరదు.

 అలాకాక, మనలో ఎవరో ఒకరు మొత్తం ధనం తీసుకోవడం జరిగితే, వాడు ఇకముందు ప్రమాదకరమైన దొంగవృత్తి మాని, ఏ వ్యాపారమో చేసుకుంటూ హాయిగా బతకవచ్చు. ఏమంటారు?'' అన్నాడు. ఇందుకు వెంటనే దొంగలిద్దరూ సరేనన్నారు. అయితే, దొంగిలించిన ధనమంతా ఎవరు తీసుకోవాలో నిర్ణయించడం పెద్ద సమస్య అయింది. పెద్ద దొంగ కొంచెంసేపు ఆలోచించి, ``ఇందుకు నాకొక ఉపాయం తోస్తున్నది.


ఈ తెల్లవారుజాము లోపున, మనలో ఎవరికి ఆ దాచిన సొము్మ సాయంతో కోటీశ్వరుడయినట్టు కల వస్తుందో, వాళ్ళకు దాన్ని ఇచ్చివేద్దాం. ఈ ఆలోచన బావున్నదంటారా?'' అన్నాడు. మిగిలిన దొంగలిద్దరూ ఇందుకు ఒప్పుకున్నారు. తరవాత అందరూ నిద్రపోయేందుకు పడుకున్నారు. కాని, ఎవరికీ నిద్రరావడంలేదు. కొంతసేపటికి పెద్ద దొంగ తెల్లవారి తన మిత్రులకు చెప్పడానికి ఒక కల ఆలోచించుకుని తృప్తిగా నిద్రపోయాడు.రెండోవాడు కూడా తతిమ్మా ఇద్దరికీ చెప్పేందుకు ఒక కల ఊహించుకుని కళ్ళు మూసుకు న్నాడు. మూడో దొంగ ఒక పథకం వేసుకుని, మిగిలిన ఇద్దరూ నిద్రపోయేదాకా ఆగి, ధనం మూటను తీసుకుపోయి, దాపులనున్న ఒక మర్రిచెట్టు తొరల్రో దాచి వచ్చి పడుకున్నాడు. తెల్లవారిన తరవాత ముగ్గురు దొంగలూ మేలుకున్నారు. చిన్నవాళ్ళిద్దరూ అడిగిన మీదట పెద్ద దొంగ తనకొచ్చిన కల అంటూ ఇలా చెప్పాడు: ``నేను మనం దొంగిలించి తెచ్చిన డబ్బంతా తీసుకుని, నేనెన్నడూ చూడని ఒక రాజ్యంలో ప్రవేశించాను.


ఎక్కడ చూసినా చక్కని పైరు పంటలతో రాజ్యం సుభిక్షంగా వున్నది. కాని, విచారించగా ఆ రాజ్యంలో దొంగల భయం అధికంగా వున్నట్టు తెలిసింది. అందువల్ల, డబ్బంతా ఎక్కడైనా సురక్షిత ప్రదేశంలో దాచి, ఏదైనా వ్యాపారం చేద్దామనుకున్నాను. కాని, దురదృష్టవశాత్తు, ఆ రాత్రే డబ్బంతా దొంగలపాలయింది. నాకు దుఃఖం ఆగింది కాదు. అప్పటికప్పుడే పోయి రాజుకు చెప్పుకున్నాను.


రాజు ఎంతో విచారపడిపోతూ, `నాయనా, నువ్వు పరాయిదేశం వాడిలా వున్నావు. నా దేశంలోని గజదొంగలను పట్టినవాడికి, నా కుమార్తెతోపాటు ఆర్ధరాజ్యం కూడా ఇస్తానని చాటింపు వేయించాను. కాని, ఎవరికీ ఆ దొంగలను పట్టడం సాధ్యం కాలేదు,' అన్నాడు. రాజకుమార్తె, అర్ధరాజ్యం అన్న మాటలు వింటూనే, నాలో ఉత్సాహం పొంగి పొర్లింది. నేను రాజుతో, `మహారాజా, విచారించకండి! నేను, ఆ గజదొంగలందర్నీ పట్టి బంధించగలను,' అని చెప్పాను. దొంగను పట్టేందుకు దొంగే కావాలని వుట్టినే అనలేదుగదా! నేను క్షణాల మీద దేశంలోని దొంగలందర్నీ పట్టుకుని, రాజుకు ఒప్పచెప్పాను.


 ఆయన అన్న మాట ప్రకారం రాజకుమార్తెను నాకిచ్చి చేసి, అర్ధరాజ్యం కూడా ఇచ్చాడు. ఈ విధంగా మనం దాచిన సొము్మవలన నేను కోటీశ్వరుణ్ణే కాదు, ఒక దేశానికే రాజును కాగలిగాను.'' రెండవ దొంగ మొదటివాడితో, ``ఫర్వాలేదు, ఒక మోస్తరుగా మంచి కలే కన్నావు!'' అని తన కొచ్చిన కల గురించి ఇలా చెప్పాడు: ``నేను డబ్బూ, నగలూ తీసుకుని తూర్పు దీవుల్లో వ్యాపారం చేసేందుకు ఓడ ప్రయాణం చేస్తూండగా, ఓడ పెద్ద తుఫానులో చిక్కుకుని బుడుంగున మునిగిపోయింది


నేను డబ్బూ, నగలూ వున్న మూటతో క్షేమంగా నాగలోకం చేరాను. అక్కడ వున్న వజ్రాలూ, మణులూ చూసి నా  కళ్ళు  జిగేలు మన్నాయి. కాని, వింత ఏమిటంటే, నాగలోకవాసులు నా వెంటవున్న నగల పనితనం చూసి అబ్బురపడిపోయారు. నాగలోకపు యువరాణి నాగదేవి, తన చెలికత్తెలను వెంటబెట్టుకుని వచ్చి, నగల్ని తన కిమ్మని అడిగింది. ఆ క్షణంలో నా బుర్ర మహా చురుగ్గా పనిచేసింది.

నేను నగలను నాగదేవికి ఇవ్వకుండా కొన్నిటిని ఆమె చెలికత్తెలకు బహూకరించాను. నాగదేవి తన చెలికత్తెలు తనకన్న అందమైన ఆభరణాలు ధరించడం చూసి ఈర్ష్యపడిపోయి, నా దగ్గిరకు వచ్చి, దీనంగా, `నువు్వ ఏది కోరినా ఇస్తాను. ఆ మిగిలిన నగలన్నీ నా కిచ్చెయ్యి,' అన్నది. ఆ మాట కోసమే ఎదురుచూస్తున్న నేను ఆమెతో, `నాగదేవీ, నేను పుట్టి పెరిగిన దేశం వదిలి, ఎన్నో శ్రమలకోర్చి నిన్ను వివాహ మాడేందుకు ఇక్కడి కొచ్చాను.

ఈ నగలన్నీ నీవే!' అంటూ నగలన్నీ ఇచ్చేశాను. అన్నమాట ప్రకారం నాగదేవి అప్పటికప్పుడే మహావైభవంగా నన్ను వివాహ మాడింది. ఈ విధంగా మనం దాచిన సొము్మవలన నేను నాగయువరాణిని వివాహ మాడి, నాగలోకానికే రాజును కాగలిగాను.'' మొదటి ఇద్దరి కలలూ విన్న మూడవ దొంగ విచారంగా ముఖం పెట్టి తన కల గురించి ఇలా చెప్పాడు: ``మీ ఇద్దరి కలలతో పోల్చితే అసలు నాది కలేకాదు. వినండి! నేను దాచిన ధనం, నగలూ తీసుకుపోయి వ్యాపారంచేసి కోటీశ్వరుణ్ణి కావడమేకాక, మరొక కోటీశ్వరుడి కుమార్తెను కూడా వివాహం ఆడాను. అయితే, మా ఇద్దరి కాపురం హాయిగా జరిగిపోతున్న సమయంలో, హఠాత్తుగా ఏదో పెద్ద చప్పుడయి కల చెదిరిపోయి,కళ్ళు తెరిచాను.

నలుగురు ముసుగు దొంగలు విగ్రహం వెనక మనం దాచిన ధనం తీసుకుని గుడి నుంచి బయిటికి పోతున్నారు. నేను వెంటనే పెద్దన్నను తట్టిలేపుతూ, `దొంగలు! దొంగలు!' అన్నాను. కాని, పెద్దన్న కళ్ళు తెరవకుండానే, `నా రాజ్యంలో దొంగలా? వాళ్ళను ఏనాడో, కాలరాచేశాను!' అంటూ పక్కకు తిరిగి పడుకున్నాడు.అప్పుడు చిన్నన్న భుజం తడుతూ, సంగతి చెప్పాను. చిన్నన్న కూడా కళ్ళు తెరవకుండానే, `నాగదేవీ, నేను రాజునై వుండగా, ఈ నాగలోకంలో దొంగలా? అహ్హహ్హ!' అంటూ నవ్వసాగాడు. ఈ లోపల ముసుగు దొంగలు మన ధనంతో అరణ్యంలోకి పారిపోయారు. ఇది వింటూనే పెద్ద దొంగలిద్దరూ గాభరాపడుతూ విగ్రహం వెనక్కుపోయి, ధనం మూట కోసం చూశారు; అది అక్కడ కనిపించలేదు. వాళ్ళు కోపంగా చిన్నవాడి దగ్గిరకు వచ్చి, ``నిజం చెప్పు! దొంగలు రావడం, నువ్వు మమ్మల్ని నిద్రలేపాలని చూడడం, అంతా పచ్చి అబద్ధం!'' అన్నారు.


చిన్నవాడు ఏమీ తొణక్కుండా, ``ఇందులో అబద్ధం ఏమీలేదు. మన దురదృష్టం ఏమంటే, ఆ దొంగలు వచ్చి మనం దాచిన సొము్మ ఎత్తుకుపోతున్నప్పుడు, మీరు తీరని రాచకార్యాల్లో తలమునకలై వుండడం!'' అన్నాడు. ఆ జవాబుతో పెద్దవాళ్ళిద్దరూ రెచ్చిపోయి, ``ఒరే, నిజానికి మేం ఎలాంటి కలలూ కనలేదు. నిద్రపోయే ముందు వాటిని ఊహించుకున్నాం. అంతే! ఇప్పుడైనా నిజం చెప్పు. ఆ ధనం ఎక్కడ దాచావు?'' అని అడిగారు. ఈసారి చిన్న దొంగ పెద్దగా నవ్వి, ``మీకు ఎలాంటి కలలూ రాలేదన్న మాట! బావుంది.

అందువల్ల, మనం అనుకున్న మాట ప్రకారం నేను కన్న కలే గొప్పది. కనక, ధనం అంతా నాకే చెందాలి,'' అంటూ పోయి మర్రిచెట్టు తొరల్రో దాచిన ధనం మూటను తెచ్చి వాళ్ళ ముందుంచాడు. దొంగలిద్దరూ చిన్నవాడి తెలివితేటలకు ఆశ్చర్యపోయారు. తాము పెద్దవాళ్ళయివుండీ చిన్నవాణ్ణి మోసం చేయాలనుకున్నందుకు సిగ్గుపడిపోయి, మొత్తం ధనాన్ని చిన్నవాడికి ఇస్తూ, ``ఒరే,తమ్ముడూ! ఈనాటినుంచీ నువ్వు దొంగతనాలు మాని, ఎక్కడికైనా పోయి ఈ ధనంతో ఏదైనా వ్యాపారం చేసుకుంటూ, తగిన పిల్లను వివాహమాడి సుఖంగా బతుకు,'' అన్నారు.


పండిత పుత్రః పరమ శుంఠః

రత్నపురి రాజ్య ఆస్థాన పండితుడు వరదాచారి. ఆయన ఎంతటి వారినైనా తన వాగ్ధాటితో చిత్తు చేసేవాడు. ఎంత గొప్ప పండితుడినైనా తన అమోఘ పాండిత్యంతో అవలీలగా ఓడించేవాడు. దాంతో ఆయన కీర్తి నలుదిక్కులా మారుమోగిపోసాగింది.

వరదాచారి కుమారుడు సుబుద్ధి. అతడికి చదువు మీద ఆసక్తి లేదు. ‘చదువే బంగారు భవిష్యత్తుకు పునాది’ అని ఎవరైనా హితవు పలికితే అతడికి తగని చిరాకు. ‘కష్టపడి చదవవలసిన అవసరం నాకు లేదు. చదువు లేకున్నా నేను హాయిగా, దర్జాగా బతకగలను. మా నాన్న గొప్ప పండితుడు. మా ఇంటి నిండా బంగారు నాణాలు, రత్న మాణిక్యాలు ఉన్నాయి’ అని గొప్పగా చెప్పేవాడు. రోజూ ఆట పాటలతో సమయం వృథా చేసేవాడు. అది గమనించిన ఓ వ్యక్తి ‘‘పండిత పుత్రః పరమశుంఠః’’ అన్నాడు.

ఆ మాటలు విన్న సుబుద్ధి పండితుడి పుత్రుణ్ని పరమశుంఠ అని గౌరవంగా పిలుస్తారని భావించి, ఎంతో పొంగిపోయాడు. ఒకరోజు సుబుద్ధి రాజుగారి ఉద్యానవనంలో ఆడుకుంటున్నాడు. అంతలో అటుగా వెళుతున్న మంత్రి, ‘‘ఎవరు బాబూ నీవు?’’ అని ప్రశ్నించాడు. ‘‘నేను పండిత వరదాచారి పుత్రుడిని. పరమశుంఠను’’ అని గర్వంగా చెప్పాడు సుబుద్ధి.

అంతలో ఏదో శబ్దం వినిపిస్తే ఇద్దరూ అటువైపు చూశారు. అక్కడ ఓ చెట్టుపై కొన్ని కోతులు ఉన్నాయి. అవి ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకు దూకుతున్నాయి. అంతలో ఓ కోతి పట్టు తప్పి కిందపడింది. వెంటనే మిగిలిన కోతులు దానిని వెలివేసి, అక్కడ నుంచి వెళ్లిపోయాయి.

సుబుద్ధి బాధపడుతూ, ‘‘ఆ కోతులు కింద పడిన కోతిపై ఎందుకు జాలి చూపలేదు?’’ అని అడిగాడు. అందుకు మంత్రి, ‘‘బాబూ! కోతి జాతిలో ఓ పద్ధతి ఉంది. కోతులు ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకు దూకేటప్పుడు కింద పడవు. ఏ కోతైనా పొరపాటున కింద పడితే, అది తమ కోతి జాతికే అవమానంగా కోతులు భావిస్తాయి. అందుకే ఆ కోతిపై జాలి చూపక దాన్ని వెలివేసి వెళ్లిపోతాయి.

ఎందుకో తెలుసా? కోతులు దేన్నైనా సహిస్తాయి కాని, చేతకానితనాన్ని మాత్రం సహించలేవు’’ అని చెప్పాడు. అది విన్న సుబుద్ధి, ‘‘అయితే పండితుల పిల్లలంతా బాగా చదువుకుంటున్నారు. కానీ చదువు రాని నేను వాళ్లందరి ముందూ చేతకానివాడిని అవుతాను కదా! మరి అందరూ నన్ను వెలివేస్తారా?’’ అని ఉద్వేగంగా అడిగాడు.

మంత్రి అతడి భుజంపై చెయ్యేసి, ‘‘అవును నాయనా. నీవు చదువుకోకుంటే అందరూ నిన్ను ‘పండిత పుత్రః పరమ శుంఠః’ అంటారు. పరమ శుంఠ అంటే తెలివితక్కువవాడు అని అర్థం’’ అన్నారు.సుబుద్ధి కాసేపు ఆలోచించుకుని, ‘‘నేను బాగా చదువుకుని గొప్ప పండితుడిని అవుతాను. తండ్రిని మించిన కొడుకు అన్న పేరు తెచ్చుకుంటాను’’ అన్నాడు. మంత్రి అతడిని మనసారా ఆశీర్వదించారు.

మాట్లాడే గాడిద

ఒక రోజున అక్బర్ బీర్బల్‌లు సభలో ఉండగా ఒక వ్యాపారి ఒక గాడిదను తీసుకొని వచ్చాడు. తాను తీసుకువచ్చిన గాడిదను రాజుగారికి అమ్మాలన్నది ఆ వ్యాపారి ఉద్దేశ్యం. సమాయానికి బీర్బల్ కూడా సభలో ఉండటం చూసి ఆవ్యాపారి ఎంతో సంతోషించాడు. అతను తీసుకువచ్చిన గాడిదను చూసి బీర్బల్ "మహారాజా!ఈ గాడిదను చూస్తుంటే ఇది ఎంతో తెలివి కలదని నాకు అనిపిస్తుంది. మనం కొంచం శ్రద్ద తీసుకొని ఈ గాడిదకు వ్రాయటం, చదవటం నేర్పిస్తే గాడిద నేర్చుకుంటుందని నాకు అనిపిస్తుంది. "అన్నాడు. అంతే అక్బర్ ఆ మాటనే పట్టుకున్నాడు. "అయితే బీర్బల్ ఈ గాడిద చాలా తెలివైనది అని అంటావు అవునా!" అని అడిగాడు మహారాజు


"అవును మహారాజా" అన్నాడు బీర్బల్ "మనం కొంచెం ఓర్పుగా చెబితే ఈ గాడిద చదవటం, వ్రాయటం నేర్చుకుంటుందని అంటావు అవునా!" అని అడిగాడు అక్బర్. మళ్ళీ 'అవునని' చెప్పాడు. బీర్బల్  వెంటనే అక్బర్ చక్రవర్తి ఓ నిర్ణాయానికి వచ్చారు. ఆ వ్యాపారి దగ్గర గాడిదను కొన్నాడు. ఆగాడిదను బీర్బల్ చేతిలో పెట్టాడు రాజుగారు గాడిదను కొని తనకు ఎందుకు ఇస్తున్నాడో బీర్బల్‌కు అర్దం కాలేదు. వెంటనే రాజుగారిని అదే ప్రశ్ననుఅడిగాడు.

బీర్బల్ ఈ గాడిదను నీతో పాటు తీసుకొని వెళ్ళు. ఓ నెల రోజులు సమయం ఇస్తున్నాను. ఈలోగా ఈగాడిదకు చదవటం, వ్రాయటం నేర్పించు. నెల రోజుల తర్వాత గాడిదను తీసుకురా! ఒక వేళ నువ్వన్నట్టుగా నెల రోజుల లోపల గాడిదకు చదవటం, వ్రాయాటం రాకపోతే నిన్ను శిక్షించాల్సి ఉంటుంది. చెప్పు ఇది నీకు సమ్మతమేనా!? " అని అడిగాడు అక్బర్ చక్రవర్తి.

బీర్బల్‌కు రాజుగారి మాట మన్నించటం మినహా వేరే గత్యంతరం లేకుండా పోయింది. "అలాగే మహారాజా! మీరు కోరుకున్న విధముగానే నెల రోజులలోపల ఈ గాడిదకు మాట్లాడటం, వ్రాయాటం నేర్పిస్తాను" అన్నాడు బీర్బల్. రాజుగారు చెప్పిన విధంగా గాడిదను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. రాజుగారి సభలో ఉన్న వారంతా బీర్బల్ సాహాసానికి ఆశ్చర్య పోయారు. "ఇదంతా జరుగుతుందా నిజంగా బీర్బల్ గాడిదకు చదవటం, వ్రాయటం నేర్పిస్తాడా?" ఒక వేళ ఆ పని చేయ లేకపోతే రాజుగారు బీర్బల్‌ను శిక్షిస్తారా? లేకపోతే బీర్బల్ మీద ఉన్న అభిమానం కొద్దీ మందలించి వదిలేస్తారా?"


"అసలు జంతువులు ఎక్కడైనా మాట్లాడతాయా? మాట్లాడటమే రాని జంతువుకు బీర్బల్ చదవడం వ్రాయడం ఎలా నేర్పిస్తాడు?" "బీర్బల్‌కు ఈ సారి ఎలా అయినా శిక్ష తప్పదు. అని ఓ వర్గం వారు.." "ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఇలాంటి చిక్కు సమస్యలను బీర్బల్ ఎంతో తెలివిగా పరిష్కరించాడు. అలాగే ఈ సారి కూడా ఎంతో తెలివిగా ఈ సమస్యను పరిష్కరిస్తాడు" అని మరొక వర్గం వారు. ఈవిధంగా సభ రెండుగా చీలిపోయింది. ఒక వర్గం బీర్బల్‌కు అనుకూలంగా ఉంటే మరొక వర్గం బీర్బల్‌కు వ్యతిరేకంగా ఉంది.

ఈ విధమైన ఊహాగానాలతో నెలరోజులు గడిచిపోయాయి. గాడిదను రాజుగారి సభకు ప్రవేశపెట్టే రోజు దగ్గరకు వచ్చింది. గాడిదతో సహా బీర్బల్ రాజుగారి సభకు హాజరయ్యాడు. "బీర్బల్! గాడిదకు వ్రాయటం, చదవటం వచ్చినదా!?" కుతూహలంగా అడిగాడు అక్బర్. "చిత్తం మహారాజా" అన్నాడు బీర్బల్. బీర్బల్ సమాధానానికి సభలో ఉన్నవారంతా ఆశ్చర్య పోయారు. "గాడిదకు నిజంగా చదవటం, వ్రాయటం వచ్చిందా!" "ఎప్పటిలాగే ఈసారి కూడ బీర్బల్ ఏదో చమత్కారం చేస్తున్నాడు" "బీర్బల్‌కు ఈసారి శిక్ష తప్పదు." ఈవిధంగా తమలో తాము మాట్లడు కోసాగారు. "బీర్బల్ నువ్వు చెప్తున్నది నిజమేనా? గాడిద నిజంగా చదువుతుందా?" అడిగాడు అక్బర్ చక్రవర్తి.

"ఏదీ అయితే గాడిదతో ఏదైనా చదివించు" అడిగాడు అక్బర్ చక్రవర్తి. వెంటనే బీర్బల్ ఒక పుస్తకం తీసుకొని గాడిద ముందు పెట్టాడు. సభలో ఉన్నవారందరూ ఆశ్చర్యపోయేలా గాడిద తన నాలుకతో పుస్తకంలో పేజీలు తిప్పటం మొదలుపెట్టింది. ఆవిధంగా తిప్పుతూ మూడవ పేజికి రాగానే గట్టిగా చదవటం మొదలు పెట్టింది. ఇదంతా చూస్తున్న అక్బర్ చక్రవర్తి, సభలో ఉన్న మిగతావారు ఆశ్చర్యంతో ముక్కున వేలువేసుకున్నారు.

"అద్భుతం నిజంగా అద్భుతం బీర్బల్ నీవు చాలా గొప్పవాడివి. నిజంగా నువ్వు అన్నట్టుగానే సాధించి చూపించావు. నీకు మంచి బహుమానం ఇచ్చి సత్కరించాలి" అంటూ బీర్బల్‌ని ఎంతగానో మెచ్చుకున్నాడు రాజుగారు. బీర్బల్ చిరునవ్వుతో ఆ ప్రసంశలు స్వీకరించాడు. "అదిసరే బీర్బల్ ఇంతకి ఆ గాడిద ఏమంటున్నది.?" అని అడిగాడు మహారాజు

"అది ఏ మంటున్నదో తెలియాలంటే మనకు గాడిద బాష తెలియాలి మహారాజా!" అన్నాడు బీర్బల్. అంతే అక్బర్ చక్రవర్తికి బీర్బల్ చేసిన చమత్కారం ఏమిటో అర్దం అయ్యిది. "సరే మనకు గాడిద బాష తెలియదు కాబట్టి గాడిద ఏం మాట్లడుతుందో మనకు తెలియదు. ఆ విషయం ప్రక్కన పెట్టు. కాని గాడిద ముందు పుస్తకం పెడితే పేజీలు తిప్పుతుంది. అక్కడక్కడ ఆగి పుస్తకం చదువుతున్నట్టు అరుస్తుంది. చెప్పు బీర్బల్! నువ్వేం చేస్తావు.? పుస్తకం చదవటం దానికి ఎలా నేర్పించావు?" అని అడిగాడు అక్బర్.

అక్బర్ చక్రవర్తి చెప్పిన ప్రశ్నకు బీర్బల్ ఇలా సమాధానం చెప్పాడు "మహారాజా! ఆరోజున గాడిదను చూచి దాన్ని మీదగ్గర మెచ్చుకుంటే ఆవ్యాపారకి నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని అనుకున్నాను. అందుకే మీ ముందు అలా చెప్పాను. మీరు వెంటనే నెల రోజులు సమయం ఇచ్చి గాడిదకు చదవటం, వ్రాయటం నేర్పించమని చెప్పారు. జంతువులతో మాట్లాడించటానికి నాకు ఏలాంటి ఇంద్రజాల విధ్యలు తెలీవు కాని ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు గాడిద పుస్తకం పేజీలు తిప్పుతూ చదువుతోందని కాబట్టి నేను అసలు విషయం చెప్పేస్తాను. తీరా అసలు సంగతి విన్నాక మీరు నన్ను శిక్షించకూడదు." అన్నాడు బీర్బల్.


అక్బర్ అందుకు అంగీకరించాడు.

"మహారాజా! గాడిదను ఇంటికి తీసుకుని వెళ్ళాక ఒక రోజంతా దానికి ఏమి పెట్టలేదు. దాంతో అది ఆకలితో నకనకలాడిపోయింది. మరునాడు ఇదిగో ఈపేజీలో గడ్డి పెట్టాను. అంతే అసలే ఆకలి మీద ఉంది దానికి తోడు పుస్తకం లోంచి గడ్డి కనిపిస్తుంది ఇంకేముంది గబగబ పుస్తకం తెరచి మొదటి పేజి తీసి అక్కడ పెట్టిన గడ్డిని తినేసింది. మరునాడు రెండో పేజిలో గడ్డి పెట్టి గాడిద ముందు పెట్టాను. పుస్తకం దాని ముందు పెట్టగానే దానిలో గడ్డి పెట్టి ఉంటానని గాడిద అనుకోవడం మొదలు పెట్టింది. దాంతో రెండో రోజు కూడ పుస్తకం దాని ముందు పెట్టగానే గబగబ మొదటి పేజీ తిప్పింది. దానికేమి కనిపించ లేదు. వెంటనే రెండో పేజీ తిప్పింది. ఈసారి అక్కడ గడ్డి కనిపించింది. మూడో రోజు కేవలం పుస్తకం మాత్రమే గాడిద ముందు పెట్టాను అందులో గడ్డి పెట్టలేదు ఎప్పుడైతే పుస్తకంలో గడ్డి పెట్టలేదో గాడిద పెద్దగా అరవటం మొదలు పెట్టింది. ఈవిధంగా షుమారు నెల రోజుల పాటు దానికి శిక్షణ ఇచ్చాను. అంతే అదేవిధంగా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. అంటూ తను ఏవిధంగా గాడిదతో మాట్లాడించాడో రాజుగారికి వివరించాడు బీర్బల్.

అంతే సభలో ఉన్న వారంతా చప్పట్లు కొట్టి బీర్బల్‌ను ఎంతగానో అభినందించారు. ఇక రాజుగారైతే బీర్బల్‌కి బోలెడన్ని బహుమానాలు ఇచ్చారు.

ఎద్దు పాలు

ఓ సారి అక్బర్ చక్రవర్తి- బీర్బల్‌ను ‘‘నాకొక గ్లాసుడు ఎద్దు పాలు కావాలి’’అని అడిగాడు. చక్రవర్తి అభ్యర్థన అసాధారణంగా వున్నా బీర్బల్ పైకి ఏమీ అనకుండా, ‘‘అలాగే సంపాదిస్తా ప్రభూ. కానీ నాకొక వారం రోజులు సమయమివ్వండి’’అని అడిగాడు. అలాగే  అన్నాడు అక్బర్.సాయంత్రం అయ్యాక ఇంటికెళ్ళాడు బీర్బల్. చక్రవర్తిగారు ఎద్దు పాలు తెమ్మని వారం రోజుల గడువుయిచ్చారు. కానీ అది అసాధ్యమైన పని. ఏం చెయ్యాలా?’ అని నిర్వేదంలో పడిపోయాడు.


అతని భార్య అది గమనించి, ‘‘ఏం జరిగింది?’’అని అడిగింది. జరిగిన సంగతి చెప్పాడు బీర్బల్. అది విని అతని భార్య పెద్దగా నవ్వింది. దాంతో ఆశ్చర్యపోవటం బీర్బల్ వంతయింది. ‘‘అదేమంత అసాధ్యం కాదు. ఏం చెయ్యాలో నేను చెబుతా, కానీ మీరు ఆరురోజుల దాకా ఇల్లు కదిలి వెళ్ళొద్దు’’ అందామె. ఆమె తెలివితేటల మీద అపారమైన నమ్మకం వున్న బీర్బల్ ‘‘అలాగే’’అని ఇంటి పట్టునే వుండిపోయాడు. అయిదురోజులు గడిచాయి. ఆరవ రోజు రాత్రి ఆమె ఒక పెద్ద గుడ్డలమోపు తీసుకుని రాజమందిరానికి వెళ్ళింది. ఆ పక్కనే వున్న సెలయేటిలో ఒక్కొక్క గుడ్డనీ ఉతకటం మొదలుపెట్టింది.


ఆ శబ్దానికి మేల్కొన్న అక్బర్ మేడ మీది వరండాలోకి వెళ్ళి ‘ఇంత రాత్రిపూట బట్టలు ఉతుకుతున్నది ఎవరా?’అని చూసాడు. అంతేగాక ఆమెను తీసుకురమ్మని ఇద్దరు భటులను పంపించాడు. ‘‘ఏమ్మా.. యింత రాత్రి పూట బట్టలు ఉతుకుతున్నావెందుకు?-’’అని బీర్బల్ భార్యను ప్రశ్నించాడు అక్బర్. ‘‘ప్రభూ, ఆరురోజుల క్రితం నా భర్త ప్రసవించాడు. మా పనిమనిషి రాలేదు. అందుకే పనంతా నేనే చేసుకోవాల్సి వచ్చింది. ఇంట్లో పనులన్నీ పూర్తిచేసుకునేసరికి చీకటి పడింది. అందుకే యింత రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నా’’అని జవాబిచ్చిందామె వినయంగా.


‘‘ఏంటి నువ్వనేది? మగవాడు ప్రసవించటం ఎలా సాధ్యం?’’అన్నాడు అక్బర్ ఆశ్చర్యంగా.ఆమె చిరునవ్వు నవ్వి, ‘‘ఇందులో ఆశ్చర్యపడేదేముంది? మీరు ఎద్దు పాలు కావాలని అడగగా లేనిది మగవాడు ఎందుకు ప్రసవించలేడు?’’ అంది. ఆమె మాటలలోని నిజాన్ని అర్థం చేసుకున్న అక్బర్ తల వూపాడు. మగవాడు ఎలా ప్రసవించలేడో, అలాగే ఎద్దుకూడా పాలను యివ్వలేదు. వెంటనే ఆయనకు బీర్బల్‌ను తాను అసాధ్యమైన కార్యం చెయ్యమని అడిగిన విషయం గుర్తుకొచ్చింది. ఆమె సమయస్ఫూర్తికి, తెలివి తేటలకు మెచ్చుకున్న అక్బర్- ఆమెకు అనేక విలువయిన కానుకలిచ్చి పంపించాడు.

యజమాని ఎవరు?

అక్బర్ చక్రవర్తి కొలువుకు రకరకాల వ్యక్తులు వస్తుండేవారు. వారంతా రకరకాల సమస్యలతో వస్తుంటారు. అందులో కొన్ని జటిలంగా ఉంటే, కొన్ని సరదాగా ఉంటాయి. ఎలాంటి సమస్యనైనా బీర్బల్ సమయస్ఫూర్తితో చాలా తేలికగా పరిష్కరించేవాడు.


ఒకసారి పొరుగుదేశం నుండి ఇద్దరు వ్యక్తులు అక్బర్ కొలువుకు వచ్చారు. వారిద్దరూ ఖరీదైన దుస్తులు, ఆభరణాలు ధరించి ఉన్నారు. ‘‘అక్బర్ పాదుషా వారికి వందనాలు. ప్రభూ! నా పేరు చిత్రసేనుడు. ఇతడు సుగ్రీవుడు, మా పనివాడు’’ అని చెప్పాడు ఒక వ్యక్తి.


వెంటనే రెండో వ్యక్తి ‘‘అబద్ధం. నేను ఇతని పనివాణ్ని కాదు. ఇతనే నా పనివాడు’’ అన్నాడు.‘‘ఇంతకూ ఎవరు పనివారు? ఎవరు యజమాని?’’ అయోమయంగా అడిగాడు అక్బర్. నేను యజమానినంటే నేను యజమానినని, నువ్వు పనివాడివంటే నువ్వు పనివాడివని వారిద్దరూ వాదించుకోసాగారు. అక్బర్‌కు, అక్కడి సభలోని వారికి ఎవరు నిజం చెప్తున్నారో అర్థం కాలేదు. చివరకు అక్బర్ బీర్బల్ సహాయాన్ని అర్థించాడు.


‘‘బీర్బల్! వీళ్ళిద్దరిలో పనివాడెవరో చెప్పగలవా?’’ అని అడిగాడు అక్బర్. అంతవరకు జరుగుతున్న తంతును చిరునవ్వుతో చూస్తున్న బీర్బల్, ‘‘తప్పకుండా ప్రభూ. నేను చాలా తేలికగా పనివాడిని గుర్తించగలను’’ అన్నాడు.


బీర్బల్ ఆ ఇద్దరి దగ్గరకు వచ్చి కాసేపు వారిని నిశితంగా పరిశీలిస్తున్నట్టు నటించి, ‘‘మీరిద్దరూ నేల మీద బోర్లా పడుకోండి’’ అన్నాడు. బీర్బల్ సూచించినట్టు చిత్రసేనుడు, సుగ్రీవుడు నేల మీద పడుకున్నారు. అక్బర్‌తో సహా సభికులందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. కొద్దిక్షణాలు గడిచాయి. బోర్లా పడుకున్న వ్యక్తులకు ఏం జరుగుతోందో తెలియట్లేదు.


ఇంతలో బీర్బల్ గట్టిగా ‘‘భటులారా! వీడే పనివాడు. వెంటనే అతని తలను నరకండి’’ అనడం వినిపించింది. అది విని చిత్రసేనుడనే వ్యక్తి పైకి లేచాడు. ‘‘ప్రభూ! నేను పనివాడిని. నన్ను చంపకండి’’ కంగారుగా అంటూ చుట్టూ చూశాడు. అక్కడ భటులు కనిపించలేదు. నవ్వుతూ నిలబడ్డ బీర్బల్ కనిపించాడు.


‘‘వాహ్... బీర్బల్! నీ తెలివి అమోఘం. శభాష్!’’ అంటూ అక్బర్ అభినందనగా చప్పట్లు చరిచాడు. మరుక్షణం అక్బర్ కొలువంతా చప్పట్లతో మారు మోగింది.

బీర్బల్‌ సమయస్ఫూర్తి

బీర్బల్‌ను ఎలాగైనా మాటలతో ఓడించాలని అక్బర్ సరదాగా ఎన్నో ఎత్తులు వేసేవాడు. అయితే  బీర్బల్ సమయస్ఫూర్తితో ఆ ఎత్తులను చిత్తు చేసేవాడు. ఒకసారి అక్బర్‌కి ఒక ఆలోచన వచ్చింది. ‘ఈసారి బీర్బల్ కచ్చితంగా ఓడిపోతాడు. బీర్బల్ తెల్లముఖం వేస్తే చూడాలని ఎన్నాళ్ళనుంచో కోరికగా ఉంది. ఆ కోరిక ఇప్పుడు తీరబోతుంది’ అనుకుని సంతోషించాడు అక్బర్. ‘‘బీర్బల్, నేను నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు దాన్ని తింటావా?’’ అని ఒకరోజు సభలో బీర్బల్‌ని అడిగాడు అక్బర్.
‘‘జహాపనా, మీ చేతులతో విషం ఇచ్చినా తింటాను.’’ అని జవాబిచ్చాడు బీర్బల్. ‘‘మరొక్కసారి ఆలోచించుకో బీర్బల్. నీకు సందేహంగా అనిపిస్తే తినలేనని ఇప్పుడే చెప్పు. నీకు తెలుసుకదా ఎవరైనా చేస్తానని చెప్పి చేయకపోతే వారికి నేను శిక్ష విధిస్తానని!’’ నవ్వును అతి బలవంతంగా దాచుకుంటూ గంభీరంగా అన్నాడు అక్బర్.

 

‘‘సందేహం ఏమీ లేదు ప్రభూ! మీ అమృత హస్తాలతో ఏది ఇచ్చినా తింటాను’’ అక్బర్ ఒక సేవకుడిని పిలిచి వెంటనే ఒక కోడిని తీసుకురమ్మని ఆదేశించాడు. సేవకుడు బతికి ఉన్న కోడిని కంచంలో పెట్టి తీసుకువచ్చాడు. ‘‘బీర్బల్ దీన్ని నువ్వు తినాలి’’ అన్నాడు అక్బర్. ‘‘తప్పకుండా తింటాను ప్రభూ’’ అంతే నిశ్చయంగా చెప్పాడు బీర్బల్. బీర్బల్ సమాధానంతో ఆశ్చర్యపోయాడు అక్బర్. ‘‘బీర్బల్ నువ్వు శాకాహారివి కదా. మాంసాహారం తినడం ఎప్పుడు మొదలు పెట్టావ్?’’

‘‘ప్రభూ మీరు కోడిని తినమన్నారు. కానీ ఎలా తినాలో షరతులు విధించలేదుగా. నేను ఈ కోడిని అమ్ముకొని తింటాను’’ చిన్నగా నవ్వుతూ ఎంతో వినయంగా చెప్పాడు బీర్బల్. అక్బర్ ఎప్పటిలాగే బీర్బల్ చతురతకు ఎంతో సంతోషించాడు.

ఉంగరం దొంగ

ఒక రోజు అక్బర్ చక్రవర్తికి బీర్బల్‌ను ఏడిపించాలన్న సరదా ఆలోచన కలిగింది. బీర్బల్‌ను ఎలా ఏడిపిస్తే బావుంటుంది? అని బాగా ఆలోచించాడు మహారాజు ఆలోచించగా, ఆలోచించగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఇంకేముంది వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టేశాడు. అక్బర్‌ను ఏడిపించటానికి రాజుగారు ఏం చేశారంటే ఆయన దగ్గర పని చేస్తున్న ఒక అతన్ని పిలిచి తన చేతికి ఉన్న ఉంగరాలలో ఒక ఉంగరాన్ని తీసి అతని చేతికి ఇచ్చాడు. ఉంగరం ఇచ్చి దానిని దాచిపెట్టమన్నాడు. అతను అక్బర్ చక్రవర్తి చెప్పినట్టుగానే ఆ ఉంగరం తీసుకోని తన దగ్గర దాచిపెట్టాడు.

ఈ సంగతులు ఏవీ కూడ బీర్బల్‌కు తెలియవు. ప్రతి రోజు వచ్చినట్లు గానే ఆరోజు కూడా రాజ్య సభకు వచ్చాడు. బీర్బల్‌ను చూడగానే అయనకు తాను వేసుకున్న పధకం గుర్తుకు వచ్చింది. అందుకని నవ్వు వచ్చిందన్న మాట. అంతే కాదు ఈ సమస్యను బీర్బల్ ఏలా పరిష్కరిస్తాడో చూడాలన్న కుతూహలం కూడా కలిగింది. "బీర్బల్ ఈ రోజు నామనస్సు ఏమి బాగాలేదు." అన్నాడు రాజు గారు "ఏమైనది మహారాజా!" కంగారుగా అడిగాడు బీర్బల్. బీర్బల్‌కు రాజుగారంటే ఎంతో అభిమానం ఉంది. ఆయన మీద ఎంతో గౌరవం ఉంది. అంతేనా ఆయన సాక్షాత్తు తమని పరిపాలించే చక్రవర్తి. మరి అట్లాంటి రాజుగారు "నామనసు బాగాలేదు" అంటే బీర్బల్ కంగారు పడకుండా ఎలా ఉంటాడు? మనమైన అంతే కదా! మనం బాగా ఇష్టపడే వాళ్ళు ఎప్పటిలా కాకుండా నీరసంగా దిగులుగా కనిపిస్తే బాధపడతాం కదా! అలాగే బీర్బల్‌ కూడా రాజుగారి మనసు బాగుండలేదు అని అనేసరికి కంగారు పడ్డాడన్న మాట.

"చెప్పండి మహారాజా! మీ మనసు ఎందుకు బావుండలేదు? ఎవరు మీ మనసును బాధపెట్టింది?" అని అడిగాడు బీర్బల్. అప్పుడు అక్బర్ తన చేతిని చూపించాడు. బీర్బల్‌కు రాజుగారి ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు. "మీమనసు ఎందుకు బావుండ లేదు?" అని అడిగితే రాజుగారు తమ చేతిని చూపిస్తున్నారేమిటి అని ఆలోచించాడు బీర్బల్. "మీ మనసు ఎందుకు బాగుండలేదు మహారాజా అని నువ్వు అడుగుతుంటే నేను సమాధానం చెప్పకుండా చేతిని చూపిస్తున్నారేమిటా అని అనుకుంటున్నావు కదూ!" అని అడిగాడు అక్బర్. అందుకు బీర్బల్ అవునన్నట్లుగా తల ఆడించాడు.

"బీర్బల్! ఒక సారి నువ్వు నా చేతిని జాగ్రత్తగా గమనిస్తే నేను ఎందుకు బాధపడుతున్నానో నీకే అర్థం అవుతుంది." అన్నాడు అక్బర్. చక్రవర్తి చెప్పినట్టుగానే చేసాడు బీర్బల్. "ఊఁ ఏమైనా అర్థం అయిందా!" అడిగాడు అక్బర్ చక్రవర్తి. "అర్థం అయ్యింది మహారాజా! మీ సమస్య ఏమిటో తెలిసింది" అన్నాడు. "అయితే చెప్పు మా సమస్య?" అడిగాడు అక్బర్. మీ మధ్య వ్రేలికి ఉండాల్సిన ఉంగరం లేదు మహారాజా!" అన్నాడు బీర్బల్. బీర్బల్ సునిశిత దృషికి అక్బర్ చక్రవర్తి మనసులో ఎంతో సంతోషించాడు. "అవును నువ్వు చెప్పింది నిజమే నాకు ఎంతో ప్రియమైన ఉంగరం ఒకటి కనిపించటం లేదు."అన్నాడు అక్బర్. "ఎక్కడైనా భద్రంగా పెట్టిమర్చిపోయారేమో గుర్తు చేసుకోండి మహారాజా!"

"లేదు బీర్బల్ నాకు గుర్తుంది. ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు కూడా చూసుకున్నాను. చేతికి ఉంగరం ఉంది. బాత్‌రూమ్‌కు వెళుతూ తీసి పక్కన పెట్టాను. నేను తిరిగి వచ్చేసరికి ఉంగరం మాయమైనది." అని చెప్పాడు. చక్రవర్తి చెప్తున్నదంతా బీర్బల్ మౌనంగా వినసాగాడు. ఇంకా అక్బర్ చక్రవర్తి ఇలా అన్నాడు. "ఆ ఉంగరం దొంగ ఎవరో ఇక్కడే ఉన్నాడు. ఆ విషయం నాకు బాగా తెలుసు. కాబట్టి ఆ ఉంగరం ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది." "మహారాజా! మీకు ఎవరి మీదనైన అనుమానం ఉంటే చెప్పండి." అడిగాడు బీర్బల్. లేదు బీర్బల్! నాకు ఎవ్వరి మీద అనుమానం లేదు. అయినా సరైన ఆధారాలు లేకుండా ఎవరినైనా అనుమానించడం చాలా తప్పు." అన్నాడు అక్బర్ చక్రవర్తి. సభలో ఉన్న వారంతా వారికి తోచిన సలహాలు చెప్పరు అందరూ మాట్లాడుతున్నా బీర్బల్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు.

కొద్దిసేపటి తర్వాత అక్బర్ "బీర్బల్ ఈ సమస్య పరిష్కరించగలవాడివి నువ్వేనని నాకు అనిపిస్తోంది అన్నాడు. "చెప్పండి మహారాజా! నేను ఏం చేయాలో చెప్పండి." అడిగాడు బీర్బల్. "బీర్బల్! నీకు జ్యోతిష్యం తెలుసు కాబట్టి నీ జ్యోతిష్యం ప్రతిభతో ఆ ఉంగరం దోంగ ఎవరో నువ్వే కనిపెట్టాలి." చెప్పాడు అక్బర్. రాజుగారు చెప్పినదానికి బీర్బల్ ఒప్పుకున్నాడు." మహారాజా మీరు బాత్‌రూమ్‌కు వెళుతూ ఉంగరం ఎక్కడ పెట్టారో ఆ స్థలం నాకు చూపించండి." అని అడిగాడు బీర్బల్. అక్బర్ చక్రవర్తి వెంటనే బీర్బల్‌ను ఓ అలమారు దగ్గరకు తీసుకునివెళ్ళాడు. "ఇదిగో ఇక్కడే పెట్టాను" అంటూ ఆ స్థలం చూపించాడు. బీర్బల్ ఆ అలమర దగ్గరకు వెళ్ళి తన చెవి ఆనించాడు. "ఆహఁ! అలాగా! సరే... సరే..." అన్నాడు.

బీర్బల్ ఏమిచేస్తున్నాడో అక్కడ ఉన్నవాళ్ళకి అర్థం కాలేదు. బీర్బల్ నిలబడిన తీరు 'ఆహా! అలాగా! ఓహొ! అని అనడం అది చూస్తుంటే ఆ దృశ్యం చూసే వారికి ఎలా ఉందంటే అలమర ఏదో చెపుతుంటే బీర్బల్ వింటున్నట్టుగా ఉంది. షుమారు ఐదు నిమిషాల తర్వాత బీర్బల్ అలమర దగ్గరనుండి ఇవతలకు వచ్చాడు. "ఉంగరం దొంగ దొరికాడు మహారాజా!" అన్నాడు. "చెప్పు బీర్బల్! ఎవారా దొంగ త్వరగా చెప్పు. రాజుగారి ఉంగరాని తీసేటంత ధైర్యం ఉన్న ఆ దొంగ ఎవరో నేను వెంటనే చూడాలి. ఇంతటి నేరానికి పాల్పడినందుకు కఠినంగా శిక్షించాలి." అన్నాడు.

"మహారాజా" ఈ అలమార ఏం చెప్తోందంటే ఎక్కడ మీరు బాత్‌రూంలోంచి వచ్చేస్తారో అని అతను ఖంగారు ఖంగారుగా ఉంగరం తీస్తుండేసరికి ఆ ఖంగారులో అతని గడ్డం అలమరలో ఇరుక్కుని పోయిందట. మీరు బాత్‌రూంలోంచి వచ్చేస్తారేమోనని భయపడి గబాల్న గడ్డం లాక్కునేసరికి కొన్ని వెంట్రుకలు, అలమారలో చిక్కుకుని పోయాయట. కావాలంటే మీరు అలమార తెరిపించండి తప్పకుండా అందులో మీకు వెంట్రుకలు కనిపిస్తాయి." అని అన్నాడు బీర్బల్. బీర్బల్ చెప్పినదంతా నిజం కాదని తెలిసినా కూడా ఎవరికైతే చక్రవర్తి తన ఉంగరాన్ని దాచి పెట్టమని ఇచ్చాడో అతను ఖంగారుగా గడ్డం సవరించుకున్నాడు. అంతే బీర్బల్ దొంగను పట్టుకున్నాడు. "మహారాజా! దొంగ దొరికాడు" అంటూ అతన్ని పట్టుకున్నాడు బీర్బల్. అక్బర్ చక్రవర్తి జరిగినదంతా బీర్బల్‌కు చెప్పాడు. అంత కచ్చితంగా బీర్బల్ దొంగను ఎలా పట్టుకోగలిగాడో అక్కడ ఉన్న వారెవ్వరికి అర్ధంకాలేదు. అదే విషయం బీర్బల్‌ను అడిగాడు అక్బర్ చక్రవర్తి.

"మరేమి లేదు మహారాజా! మీరు అలమరలో ఉంగరం పెట్టి వెళ్ళానని చెప్పారు. నేను మీరు చెప్తున్నది నిజమనే అనుకున్నాను. అందుకే మీరు నాకు జ్యోతిష్యం తెలుసునని చెప్పగానే నాకు ఈ ఉపాయం తోచింది. వెంటనే అలమర దగ్గరకు వెళ్ళి అలమరకు చెవి ఆనించి నిలబడి ఏదో విన్నట్టుగా నటించాను. అక్కడి నుంచి ఇవతలకు వచ్చి ఉంగరం తీస్తుండగా దొంగ గడ్డం అలమారలో చిక్కుకుని పోయింది అని కల్పించి చెప్పాను. నేను ఇలా చెప్పగానే ఉంగరం దొంగ ఎవరో తప్పకుండా గడ్డం సవరించుకుంటాడని నాకు తెలుసు. అంతే దొంగను సులభంగా పట్టుకోవచ్చని అనుకున్నాను. అయితే మీరు ఉంగరం దాచి పెట్టమని ఇచ్చినా కూడా అతను ఆ విషయం మర్చిపోయి గడ్డం సవరించుకోవడంతో దొంగ దొరికిపోయాడు." అని తను దొంగను ఎలా పట్టుకున్నాడో రాజుగారికి వరించాడు బీర్బల్.

తెనాలి రామలింగ - దొంగ

తెనాలి రామలింగడి ఊళ్లో దొంగల భయం ఎక్కువగా ఉండేది. ప్రతిరోజూ ఎవరో ఒకరి ఇంట్లో దొంగలుపడి దోచుకుంటూ ఉండేవారు. తన ఇంటికి కూడా దొంగ ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదని అనుకున్నాడు రామలింగడు. దీంతో తన భార్యతో కలిసి ఒక ఉపాయం పన్నాడు.


ఒక తేలును తెచ్చి అగ్గిపెట్టెలో పెట్టి, దాన్ని గూట్లో పెట్టి, ఏమేం చేయాలో అన్ని భార్యతో చెప్పాడు రామలింగడు. సరిగ్గా ఆ రోజు రాత్రే ఒక దొంగ రామలింగడి ఇంట్లోకి జొరబడ్డాడు. ఇది గమనించిన ఆయన భార్యతో పెద్దగా ఇలా అన్నాడు...


"ఏమేవ్...! మొన్న మా పెద్దన్న ఉంగరం తెచ్చి ఇచ్చాడు గదా... అది ఎక్కడ పెట్టావు" అని అన్నాడు. దీనికి ఆమె "ఏదీ ఆ వజ్రాల ఉంగరమేనా..? అయ్యో నా మతిమండా, అగ్గిపెట్టెలో పెట్టి గూట్లో ఉంచానండీ.. దాన్ని తీసి పెట్టెలో పెడదామని మర్చేపోయాను" అంది.


"ఎంతపని చేశావే. అదసలే లక్షల విలువ చేసే వజ్రాల ఉంగరం. అది కాస్తా ఏ దొంగో ఎత్తుకుపోయాడంటే మన గతేంకాను" అన్నాడు రామలింగడు. "ఏమీకాదుగానీ పడుకోండి. పొద్దున్నే పెద్ద పెట్టెలో పెట్టేస్తాగా..!" అంది భార్య. అంతే అంతటితో వాళ్లు నిద్రపోయినట్లుగా నటిస్తూ పడుకుండిపోయారు.


జరిగిందంతా విన్న దొంగ.. రామలింగడి దంపతులు గుర్రుపెట్టి నిద్రపోవడం గమనించి మెల్లిగా గూట్లో చెయ్యిపెట్టి అగ్గిపెట్టె అందుకున్నాడు. దాన్ని తెరిచి ఉంగరం కోసం వేలు పెట్టాడు. ఇంకేముంది. తేలు దొంగ వేలును కుట్టేసింది. దీంతో నొప్పికి తాళలేని దొంగ విలవిలాడిపోయాడు. అయినా కూడా చప్పుడు చేస్తే.. నలుగురూ వచ్చి తనను పట్టుకుంటారన్న భయంతో కిక్కురుమనకుండా మెల్లిగా జారుకున్నాడు.


ఇదంతా గమనిస్తూ ఉన్న రామలింగడి దంపతులు నవ్వుకున్నారు. అప్పుడు రామలింగడు తన భార్యతో... "మా పెద్దన్న ఉంగరం దొంగన్నకు బిర్రు అయినట్లుంది పాపం" అన్నాడు ఎగతాళిగా. దొంగకు రామలింగడు చేసిన మోసం తెలిసిపోయి.. ఇంకెప్పుడూ అతడింటికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నాడు.

తెనాలి రామలింగడు - భలే శుంఠ

విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణ దేవరాయుల ఆస్థానంలో తెనాలి రామలింగడు కవి. ఎప్పటికప్పుడు తన తెలివితేటలతో ఎదుటివారిని బోల్తా కొట్టించి, తన పాండిత్యంతో రాజును మెప్పించేవాడు.రాయలవారి ఆస్థానంలో ప్రతి ఏటా "భలే శుంఠ" అనే పోటీలు జరుగుతుండేవి. ఈ పోటీలలో అందరికంటే గొప్ప శుంఠను గుర్తించి 5 వేల బంగారు నాణాలతో రాజు సత్కరించేవారు. అయితే, ప్రతిసారీ ఈ బహుమతిని తెనాలి రామలింగడే తన తెలివితేటలతో గెలుచుకుంటుండేవాడు.

దీన్ని గమనించిన ఆ రాజ్యంలోని సేనాధిపతికి కోపంతో "ఎప్పుడూ రామలింగడే గెలుచుకుంటున్నాడు. ఈసారి వేరొకరికి ఈ బహుమతి వచ్చేలా చేయాలి" అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా సరిగ్గా పోటీలు మొదలయిన రోజు రామలింగడి గదికి బయటినుండి గడియ పెట్టించాడు.ఒకవైపు రామలింగడు ఆ గదిలోంచి బయటకు రాలేక నానా అవస్థలు పడుతుంటే... మరోవైపు రాయలవారు పోటీలను తిలకిస్తూ, శుంఠ ఎవరో తేల్చే పనిలో మునిగిపోయి ఉన్నారు. చివరకు ఎలాగోలా రామలింగడు గదిలోంచి బయటపడి నేరుగా పోటీలు జరిగే చోటుకు చేరుకున్నాడు.

దీన్ని గమనించిన రాయలవారు "అదేంటి రామలింగా...! ఎందుకింత ఆలస్యంగా వచ్చావు...?" అంటూ ప్రశ్నించారు. సమాధానంగా రామలింగడు మాట్లాడుతూ... "ప్రభూ...! నాకు ఉన్నట్లుండి వంద బంగారు నాణేల అవసరం వచ్చింది. వాటిని ఏర్పాటు చేసుకుని వచ్చేసరికి ఆలస్యమైంది" అని అన్నాడు."ఏంటీ... వంద బంగారు నాణేల కోసం ఇంత సమయం వృధా చేశావా...? ఈ పోటీకి వచ్చి, గెలిస్తే నీకు 5వేల బంగారు నాణేలు దక్కేవి కదా...! ఆ మాత్రం నీ బుర్రకు తట్టలేదా...? ఒట్టి శుంఠ లాగున్నావే...!" అంటూ నవ్వుతూ అన్నాడు రాయలవారు. "అవును ప్రభూ...! నేను శుంఠనే..!" అని అన్నాడు రామలింగడు రెట్టిస్తూ... "నిజంగా నువ్వు శుంఠవే...!" కోపంగా అన్నాడు శ్రీకృష్ణదేవరాయులు.


 అప్పుడు రామలింగడు తెలివిగా... "ప్రభూ...! నిజంగా శుంఠను నేనే కదా...! అయితే ఈ పోటీ నేనే నెగ్గినట్లు కదా...!" అన్నాడు. దాంతో నాలిక్కరుచుకున్న రాయలవారు రామలింగడి తెలివికి మెచ్చి, 5వేల బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చి, విజేతగా ప్రకటించాడు

తెనాలి రామలింగడి తెలివి


శ్రీకృష్ణదేవరాయలకు తన మంత్రి తెనాలి రామలింగడి తెలివి, చతురతను పరీక్షించాలని ఎప్పుడు కోరికగా ఉండేది.ఒకసారి రామలింగడి తెలివిని మెచ్చి రాజు ఒక గంప నిండా బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు. బంగా రు నాణేలు గంప నిండా ఉండటంతో ఏమాత్రం కుదుపు వచ్చినా గంపలోని పైనున్న నాణేలు కింద ప  డతాయి. పైగా ఆ గంప చాలా బరువుగా ఉంది.
ఎవ్వరూ ఆ గంపను మోయలేరు. దాంతో మిగిలిన సభికులు రాజుగారు రామలింగడిని తెలివిగా ఇరికించారని సంతోషించారు. రామలింగడు ఆ గంపను లేపడానికి ప్రయత్నించగా అది కనీసం కదలనైనా లేదు. కొద్ది సేపు ఆలోచించిన రామలింగడు తన తలపాగాను తీసి నేలపై చాపలాగా పరిచి అందులో కొన్ని నాణేలను పోసి మూట కట్టాడు. కొన్ని నాణేలను తన జేబుల్లో నింపుకుని, మూటను వీపు మీద వేసుకుని, వెలితి పడిన గంపను నెత్తిన పెట్టుకుని నడవడం మొదలుపెట్టాడు.


రామలింగడి సమయస్పూర్తికి ఆశ్చర్యపోయిన రాజు "శభాష్ రామలింగా! శభాష్!" అంటూ మెచ్చుకోసాగాడు. రాజుగారి వైపు తిరిగిన రామలింగడు వినయంగా తలవంచి నమస్కరించిగానే అతని జేబుల్లోని నాణాలు బరువుకు నేలమీద పడిపోయాయి. వాటి చప్పుడు సభంతా మార్మోగింది. అంతే సభంతా నవ్వులతో నిండిపోయింది. రామలింగడి తొందరపాటుకు అంతా నవ్వసాగారు. దాంతో గంపను, ముటను కిందపెట్టి రామలింగడు ఆ జారి పడిపోయిన నాణేల కోసం సభంతా వెతకసాగాడు. పడుతూ, లేస్తూ ఏరుకోవడం చూస్తున్న సభికులకు ఎంతో తమాషాగా అనిపించింది. అందరు తలోమాట అన్నారు.

"ఎంత దురాశపరుడు" అన్నాడు ఆస్ధాన పూజారి. "గంపెడు నాణేలున్నా కిందపడిన రెండు మూడు నాణేల కోసం వెతుకుతున్నాడు" అన్నాడు సేనాధిపతి. "అదిగో ఆ స్తంభం వెనకాల ఒకటి, రాజు గారి సింహాసనం పక్కన ఒకటి" అనుకుంటూ సభంతా పరిగెత్తుతూ కింద పడిన నాణేలను ఏరసాగాడు రామలింగడు. ఈ దృశ్యం చూసిన ఒక మంత్రి రాయలవారి దగ్గర కొచ్చి ఆయన చెవిలో "ఇలాంటి సిగ్గుమాలిన వ్యక్తిని నేనింతవరకూ చూడలేదు" అంటూ రామలింగడిని ధూషించసాగాడు.


రామలింగడు నాణేలన్నీ ఏరిన తర్వాత రాజు "రామలింగా! నీకు గంపెడు నాణేలను ఇచ్చాను కదా! మరి ఎందుకింత దురాశ, కిందపడిన కొన్ని నాణేల కోసం వెతికావు? అన్నారు. "రాజా! ఇది దురాశ కాదు, కిందపడిన నాణేలపై కూడా మీ బొమ్మ మీ పేరు రాసి ఉంది కదా! ఇలా అందరూ నడిచే చోటపడి, ఎవరైనా తొక్కితే అది నేను సహించలేను. కాబట్టే నేను అంత అదుర్దాగా వాటిని ఏరి వేశాను" అని చెప్పడంతో సభంతా మూగబోయింది.


రాయలవారు ఆనందంతో సింహాసనం దిగివచ్చి రామలింగడిని కౌగిలించుకున్నారు. అతనికి మరో గంపెడు బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు.

తెనాలి రామలింగడు - దొంగలు

శ్రీకృష్ణదేవరాయలవారి కొలువులో తెనాలి రామలింగడు ఒక మహాకవి. ఎంతటివారినయినా తన తెలివితో    ఓడించగలడు. రాజును సంతోషపరచి బహుమతులు ఎన్నోపొందేవాడు. నలుగురు పేరు మోసిన దొంగలు రేపు రామలింగడి ఇంటిని దోచుకోవాలనిపథకం వేసి, దొంగలు రామలింగడి ఇంటి వెనుక తోటలో అరటి చెట్ల పొదలో నక్కి ఉన్నారు.రామలింగడికి భోజనం వేళయింది. చేతులు కడుగుకోవడానికి రామలింగడు పెరటిలోకిపోయాడు.


 అనుకోకుండా అరటిచెట్లు వైపు చూశాడు. చీకటిలో దాగిన దొంగల్ని గమనించాడు. రామలింగడు కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు భార్యను పిలిచి పెద్దగా "ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది. ఈ రోజు నగలు నాణాలు ఇంటిలో ఉంచకూడదు వాటిని ఒక సంచిలో మూటకట్టి ఈ బావిలో పడేద్దాం!" అన్నాడు. ఈ మాటలు దొంగలు విన్నారు. రామలింగడి ఉపాయం ఫలించింది. తరువాత రామలింగడు భార్య చెవిలో ఏదో చెప్పాడు. ఇంటి లోపలికి పోయి ఒక మూటను తయారు చేశారు. ఒక మూటను బావిలో పడేశారు. మూటను బావిలో వేయడం దొంగలు చూశారు. వెదకబోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు. అందరూ నిదురపోయేదాకా ఉండి తరువాత బావిలో దిగుదాం అని దొంగలు నిర్ణయించుకున్నారు. బాగా చీకటిపడింది. అందరూ నిదుర పోయారు. ఆ నలుగురు దొంగలు అరటి చెట్ల వెనుక నుంచి లేచి బావిలోకి తొంగి చూశారు. మొదట ఒకడు బావిలోకి దిగి నగల మూట కోసం చాలసేపు వెతికాడు.


నీరు ఎక్కువగా ఉన్నందున నగల మూట దొరకలేదు. నీరు బయటికి తోడితే మంచిదని మరొక దొంగ చెప్పాడు. సరేనని చేద బావిలోకి విడిచి చాలాసేపు నీరు తోడిపోశారు. రామలింగడు దొంగలు నీరు తోడి పోయడం చూశాడు. మళ్ళీ ఉపాయం ఆలోచించాడు. చప్పుడు చేయకుండా పెరటి లోకి పోయి అరటి చెట్లకు నీరు బాగా పారేలాగా పాదులు చేశాడు. వంతులవారీగా దొంగలు బావిలోని నీరు తోడసాగారు. ఎంత తోడినా బావిలోని నీరు తరగలేదు. కాని అరటి చెట్లకు నీరు బాగా పారింది. తెల్లవారు జామున కోడికూసే వేళ వరకూ తోడిపోశారు. చివరకు మూట దొరికింది. కష్టపడినందుకు ఫలితం దక్కిందని మురిసిపోయారు. ఎంతో ఆశగా చూస్తూ మూటముడి విప్పారు. అందులో నగలకు బదులు నల్ల రాళ్ళు ఉన్నవి. దొంగలకు నోట మాట రాలేదు.

రామలింగడు వారిని ఎలా మోసం చేశాడో తెలిసింది. సిగ్గుతో తలవంచుకొని పారిపోయారు. ఇంతకాలం తమను మించినవారులేరని ఆ దొంగలు మిడిసిపడేవారు. ఎంతోమందిని దోచుకోగలిగారు. కాని రామలింగడి ఇంటిని మాత్రం దోచుకోలేక పోయారు. తెలివిగ రామలింగడే దొంగలను ఉపయోగించుకోగలిగాడు. జరిగిన సంగతి రాజుకు తెలిసింది. రాజు రామలింగడి తెలివికి సంతోషపడి బహుమతులతో గౌరవించాడు.

మాతృభాష గొప్పతనం

శ్రీకృష్ణదేవరాయలు అయిదు వందల ఏళ్ల క్రితం మన దక్షిణ భారతాన్ని పరిపాలించిన చక్రవర్తి. ఈయన యుద్ధాలలో ఎంత నిపుణుడో, కావ్య రచనలో అంత నేర్పరి. ఈయనకు "సాహితీ సమరాంగణ చక్రవర్తి" అనే బిరుదు ఉండేది. అముక్తమాల్యద, రాయలు రచించిన గొప్ప కావ్యం. రాయల దగ్గర ఎనిమిది మంది గొప్ప కవులుండేవారు. వారిని 'అష్టదిగ్గజాలు' అని పిలిచేవారు. అల్లసాని పెద్దన, ముక్కుతిమ్మన, రామభద్రుడు, ధూర్జటి, భట్టుమూర్తి, పింగళి సూరన, మాదయగారి మల్లన, తెనాలి రామకృష్ణుడు రాయల అస్థానకవి దిగ్గజాలు. ఆయన సభకు "భువన విజయం" అని పేరు.

ఒకసారి రాయల దగ్గరకు ఒక మహా పండితుడు వచ్చాడు. అతడు అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఇంతకీ సమస్య ఏమిటంటే రాయల సభలోని కవి పండితుల్లో ఎవరైనా అతని మాతృభాషను కనిపెట్టాలి. రాయలవారు తన కవిదిగ్గజాలను ఈ సమస్య విడగొట్టమని కోరాడు.

మొదట 'ఆంధ్రకవితాపితామహుడని పేరు పొందిన పెద్దన కవి లేచి, తనకు వచ్చిన భాషలలో అతనితో సంభాషించి, వాదించి కూడా, అతని భాష తేల్చుకోలేక పోయాడు. తరువాత ఆరుగురూ అంతే. చివరికి తెనాలి రామకృష్ణుని వంతు వచ్చింది. ధారాళంగా భాషలన్నీ వల్లె వేస్తున్న ఆ పండితుని దగ్గరకు వెళ్ళాడు. ఎంతో సేపు అతనికి ఎదురుగా నిలబడి ఏమీ అడగలేక పోయాడు. ఓటమి తప్పదని రాయలు భావించాడు. ఆ ఉద్ధండ పండితుడు కూడా ఉప్పొంగిపోతున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా తెనాలి కవి ఆ పండితుని కాలును గట్టిగా తొక్కాడు. ఆ బాధ భరించలేక పండితుడు 'అమ్మా' అన్నాడు. అంతే! " నీ మాతృభాష తెలుగు పండితోత్తమా!" అని తేల్చేశాడు తెనాలి రామకృష్ణుడు. పండితుడు ఒప్పుకోక తప్పలేదు. రాయల ఆనందానికి అంతులేదు. శభాష్! వికటకవీ అని రామకృష్ణుని మెచ్చుకొని బహుమానంగా సువర్ణహారం ఇచ్చాడు.

మాతృభాష గొప్పతనం అదే. ఆనందంలో కాని విషాదంలో కాని మన నోటి నుండి వెలువడేది మన మాతృభాషే. కన్నతల్లిలా, మాతృభూమిలా, మాతృభాష మధురమైనది, మరపురానిది.

దురాశ దుఃఖానికి చేటు

వింధ్యారణ్యం అనే ప్రాంతంలో భైరవుడు అనే పేరుగల వేటగాడు ఉండేవాడు. రోజూ అడవికి వెళ్ళి, రకరకాల ఆహార పదార్థాలను సేకరించి, వాటితో తన కుటుంబాన్ని పోషించేవాడు. అడవిలో దొరికే ఆకులు, దుంపలు, కాయలు, పండ్లు, తేనె, వెదురు బియ్యం లాంటి వాటన్నింటి కంటే భైరవుడికి... కుందేలు, జింక, అడవిపంది వంటి జంతువుల మాంసమంటే భలే ఇష్టం.


ఒకరోజు ఒక బలసిన జింకను వేటాడి చంపిన భైరవుడు, ఇంటిల్లిపాదీ ఆనందంగా విందు చేసుకోవచ్చునే సంతోషంలో దాన్ని భుజంపైన వేసుకొని తన ఇంటి దారి పట్టాడు. అయితే ఆ అడవి మార్గంలో అతనికి అనుకోకుండా బాగా మదించి, కోరలు ఉన్న అడవి పంది ఒకటి కనిపించింది.


 భైరవుడు తన భుజం మీది జింక శవాన్ని నేలపైకి దించి, తన విల్లమ్ములు తీసుకుని పదునైన బాణంతో ఆ అడవి పంది రొమ్మును గాయపరిచాడు. అసలే కోపం, మొండితనం ఎక్కువగా ఉండే అడవిపంది గాయాన్ని లెక్కచేయకుండా వేగంగా పరుగెత్తుకొచ్చి భైరవుడి పొట్టను కోరలతో చీల్చి చెండాడి, చంపివేసింది. తర్వాత గాయం బాధ ఎక్కువై అది కూడా చచ్చిపోయింది. భైరవుడు, అడవిపందిల తొక్కిసలాటలో అటుగా వచ్చిన పాము కూడా చనిపోయింది


ఇంతలో క్షుద్రబుద్ధి అనే నక్క ఆహారం వెదకుతూ అటుకేసి వచ్చింది. చచ్చిపడి ఉన్న వేటగాడు, జింక, పంది, పాము దానికి కన్నుల విందుగా కనిపించాయి. నక్కలు స్వయంగా వేటాడలేవు కాబట్టి... పులి, సింహం లాంటి జంతువులు చంపి తిని వదలిన అవశేషాలను, జీవుల శవాలను తిని తృప్తి పడతాయి. అందుకే ఒకేసారి నాలుగూ చనిపోయి కనిపించే సరికి క్షుద్రబుద్ధి ఎగిరి గంతులు వేసింది.


 దగ్గరికెళ్లిన నక్క ఇలా ఆలోచించింది "ఈ మనిషి శవం ఒక మాసం పాటు తినొచ్చు. జింక, పంది శవాలను రెండు నెలల పాటు భోంచేయవచ్చు. ఈ పాము తలను తీసేసి ఒక రోజంతా కడుపునింపుకోవచ్చు. అంటే మూడు నెలల ఒక్క రోజు పాటు ఆహారం గురించి వెదికే పనే లేదన్నమాట. మరి ఈ పూట మాటేమిటి? ఆ! ఈ వేటగాని ధనుస్సుకు కట్టివున్న కమ్మని వాసన వేస్తున్న, నరాలతో చేసిన అల్లెత్రాటిని తింటే సరిపోతుంది." అనుకుంది.


 అనుకున్నదే తడవుగా నక్క వింటిని సమీపించి, లాగి బిగించి ఉన్న దాని నరాలతో చేసిన అల్లెత్రాడును కొరికింది. అంతే...! పదునైన "వింటి కోపు" దాని శరీరంలో గుచ్చుకుంది. బాధతో విలవిలలాడుతూ... తన దురాశకు చింతిస్తూ నక్క ప్రాణాలు విడిచింది. ఇప్పుడక్కడ నక్కతో కలిపి ఐదు శవాలు పడి ఉన్నాయి.


 భైరవుడు ఒక జింక చాలదని అడవిపందిని వేటాడబోయి చనిపోయాడు. నక్క ఎలాంటి కష్టం లేకుండా మూడు నెలల పాటు తిండి దొరికించుకుని కూడా, పిసినారి తనంతో వింటినారిని కొరికి, తానూ శవంగా మారింది. దీన్నిబట్టి మీకెమర్థమయ్యింది పిల్లలూ...! దురాశ దుఃఖానికి చేటు. మానవుడు ఆశాజీవే కానీ అత్యాశ పనికిరాదు.

వేటగాడి దురాశ

ఒక అడవిలో ఒక నెమలి ఉండేది. అది అక్కడే ఉన్న సరస్సులో నివసించే ఒక కప్పతో స్నేహం చేసింది. కొద్దిరోజుల్లోనే అవి రెండూ మంచి స్నేహితులై పోయాయి. ఒకరోజు ఒక వేటగాడు ఆ అడవికి వచ్చాడు. సరస్సు దగ్గరున్న నెమలిని చూసాడు. వల విసిరి దాన్ని పట్టుకున్నాడు. అది చూసి కప్ప బాధతో విలవిల్లాడి పోయింది.

‘‘దయచేసి నా స్నేహితురాలిని వదిలిపెట్టు’’ అంటూ కప్ప వేటగాడిని ప్రాధేయపడింది.‘‘నీ స్నేహితురాలిని విడిచిపెడితే నాకేం లాభం? దీన్ని సంతలోకి తీసుకెళ్ళి అమ్మితే నాకు బోలెడంత డబ్బు వస్తుంది’’ అన్నాడు వేటగాడు.కప్ప ఒక్క క్షణం ఆలోచించింది. ‘‘ఒకవేళ నీకు ధనం ఇస్తే నెమలిని వదిలిపెడతావా?’’ అని అడిగింది.‘‘తప్పకుండా!’’ అన్నాడు వేటగాడు.

కప్ప నీటిలోకి మునిగి, కాస్సేపటి తరువాత పైకి లేచింది. దాని చేతిలో ఒక పెద్ద ముత్యం ఉంది. ‘‘ఇది తీసుకుని నా స్నేహితురాలిని వదిలిపెట్టు’’ అని అంది.వేటగాడు ఆ ముత్యాన్ని చూసి ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. నెమలిని వదిలేసి ముత్యం తీసుకుని ఇంటి దారి పట్టాడు. ఇంటికి చేరుకున్న తరువాత వేటగాడి భార్య ‘‘వెర్రినాగన్న! ఇది ఎంతో విలువైన ముత్యం. ఒక్కటే తీసుకుని వచ్చావు. ఆ కప్ప దగ్గర ఇంకా చాలా ఉండి ఉంటాయి. వెళ్ళి మొత్తం పట్రా!’’ అని చెప్పింది.

వేటగాడు తిరిగి అడవికి బయలుదేరుతుంటే అతని భార్య ‘‘ఈ ముత్యం తీసుకెళ్ళి ఆ కప్పకు చూపించి ఇలాంటివే ఇంకొన్ని తీసుకురమ్మని చెప్పు. లేదంటే ఇంకేదైనా పట్టుకుని వస్తుంది’’ అంది. వేటగాడు సరస్సు దగ్గరకు వెళ్ళి కప్పను కలుసుకున్నాడు. ‘‘మళ్ళీ వచ్చావేమిటి?’’ అని అడిగింది కప్ప.

‘‘నాకు ఇలాంటి ముత్యాలు ఇంకొన్ని కావాలి. నువ్వు ఇవ్వకపోతే నీ స్నేహితురాలిని పట్టుకుపోతాను’’ అని బెదిరించాడు.‘‘సరే, నీ చేతిలోని ముత్యం ఇలా ఇవ్వు. అలాంటివే వెదికి తెస్తాను’’ అంది కప్ప. వేటగాడు ముత్యాన్ని కప్పకు ఇచ్చాడు. కప్ప వేటగాడికి అందనంత దూరంగా ఈది వెళ్ళి ‘‘అత్యాశతో చేతిలో ఉన్నది కాస్తా పొగొట్టుకున్నావు. నా స్నేహితురాలు అడవిలోకి వెళ్ళిపోయింది. నీకు దొరకదు. నేను కూడా దొరకను. వస్తా’’ అని చెప్పి బుడుంగున నీటిలోకి మునిగిపోయింది.

వింత గొర్రె

ఒక రోజు ఒక వ్యాపారస్తుడు కొన్ని గొర్రెలతో అడవి దాటుతుండగా అందులో ఒక గొర్రె దారితప్పి ఆ దట్టమైన అడవిలోనే ఉండిపోయింది. అక్కడ క్రూరమృగాలు ఉంటాయి, వాటి బారిన పడి చస్తానేమోనని గొర్రె చాలా భయపడింది. అందుకే దేనికంటా పడకుండా జాగ్రత్తగా ఉంటూ నెమ్మదిగా అటూ ఇటూ తిరగసాగింది. ఒకరోజు గొర్రెకు ఒక సింహం తోలు కనబడింది. వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చింది. ‘ఏ క్రూరమృగం ఎప్పుడు దాడి చేస్తుందోనని చస్తూ బతుకుతున్నాను. ఈ తోలును కప్పుకుంటే నేను కూడా సింహంలా కనబడతాను. అప్పుడు నా జోలికి ఎవరు రారు’ అని అనుకుంది.


వెంటనే గొర్రె ఆ తోలును తీసుకుని కప్పుకుంది. ఇప్పుడది వింత జంతువులా కనబడసాగింది. గొర్రె ఆ కారం చూసి కుందేళ్ళు, జింకలు, ఎలుగుబంటులు, నక్కలు భయంతో పరుగులు పెట్టాయి. చివరకు పులులు, సింహాలు కూడా గతుక్కుమన్నాయి. అది చూసి గొర్రెకు చాలా సంతోషం కలిగింది. వాటిని ఇంకా భయపెట్టడానికి గొంతు కాస్త మార్చి విచిత్ర శబ్దాలు చేయడం, కాలు నేలకు రాస్తూ జంతువుల మీదకు దాడి చేస్తున్నట్టు నటించడం చేయసాగింది. దానితో ఆ అడవి జంతువులన్నీ బిక్కచచ్చిపోయాయి. వాటి కంటి మీద కునుకు లేకుండా పోయింది. గొర్రె కడుపునిండా గడ్డిమేస్తూ యధేచ్ఛగా తిరగసాగింది.


ఒకరోజు గొర్రె ఒక కాలువ ఒడ్డుకు షికారు వెళ్ళింది. అక్కడి ప్రదేశమంతా పచ్చటి గడ్డితో ఎంతో అందంగా ఉంది. ఆ లేత గడ్డిని చూసి గొర్రె ఎంతో హుషారుగా వాటిని మేయడం మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే ఒక సింహం దాహం తీర్చుకోడానికి వచ్చి గొర్రెను చూసింది. ‘ఇదేమి విచిత్రం, సింహం జాతికి చెందిన జంతువు గడ్డిమేయడమా? సింహం ఆకలితో చస్తుంది. కానీ గడ్డి మాత్రం మేయదు. బహుశా ఇది క్రూర జంతువు కాకపోవచ్చు’ అని ఆలోచించి ఒక్కసారిగా గర్జించింది.


ఆ అరుపువిని గొర్రె భయపడిపోయింది. తన ప్రాణాలను రక్షించుకోవడానికి పరుగుపెట్టింది. ఇంతలో గొర్రె కప్పుకుని ఉన్న సింహం తోలు దాని ఒంటి మీద నుండి జారిపోయింది. ఎదురుగా ప్రత్యక్షమైన గొర్రెను చూసి సింహం నోరు వెళ్ళబెట్టింది. గొర్రె ఎలాగోలా సింహానికి దొరక్కుండా అక్కడి నుండి పారిపోయింది. ఎదో విధంగా అడవిని దాటి తనకు కనబడి న ఊళ్లోకి వెళ్లిపోయింది. ఆ సంగతి తెలిసి జంతువులన్నీ నవ్వుకున్నాయి. ఇక ఆ తరువాత అడవిలో నిర్భయంగా సంచరించసాగాయి

రామాపురం రంగడు

రామాపురం అనే గ్రామంలో రంగడు అనే బాలుడు ఉండేవాడు. వాడికి సోమరితనం ఎక్కువ. ఒక్కపని కూడా సరిగ్గా చేసేవాడు కాదు. బడికి వెళ్ళమని పంపిస్తే మధ్యలో బడి ఎగ్గొట్టి ఊరవతలి మైదానానికి వెళ్ళి ఆడుకునేవాడు. తల్లితండ్రులు ఎంత చెప్పినా, కొట్టినా తన ప్రవర్తనను మార్చుకునేవాడు కాదు.

ఒకరోజు రంగడికి ఆడుకోవడానికి ఎవరూ కనిపించలేదు. సరిగా ఆ సమయంలో వాడికి ఒక చీమ కనబడింది. ఆ చీమ ఆహారం మోసుకుని హడావుడిగా వెడుతోంది. ‘‘చీమా, చీమా ఎక్కడికి ఆ పరుగు. కాసేపు ఆగు. ఆడుకుందాం’’ అని అడిగాడు.

‘‘నాకు అంత సమయం లేదు. వానాకాలం ఎంతో దూరంలో లేదు. ఇప్పుడు ఆహారం సంపాదించకపోతే రేపు నేను చాలా కష్టపడతాను. నేను రాను’’ అంటూ హడావుడిగా వెళ్ళిపోయింది చీమ.

ఏమీ తోచక అలా బయటకు వెళ్లిన రంగడికి, చెట్టు కొమ్మ మీద కూర్చుని అరటిపండు తింటున్న ఒక కోతి కనిపించింది. ‘‘కోతి బావా! కోతి బావా! కోతికొమ్మచ్చి ఆడుకుందామా?’’ అని అడిగాడు.

‘‘అమ్మో! నీతో నేను ఏ ఆటా ఆడలేను. మా యజమానితో నేను పట్నానికి వెళ్ళాలి. ఎన్నో తమషా ఆటలు ఆడి డబ్బు సంపాదించి పెట్టాలి. అతని కోసం ఎదురుచూస్తున్నాను. అదుగో మాటల్లోనే వచ్చేశాడు. ఇంకెప్పుడైనా ఆడుకుందాం. వస్తాను’’ అంటూ కోతి చెట్టు దిగి పరుగెత్తింది.

రంగడికి ఎంతో నిరాశ కలిగింది. సరిగ్గా అప్పుడే ఒక ఎద్దు పొలం వైపు వెళ్తూ కనిపించింది. ‘‘ఎద్దు మామా! ఎద్దుమామా! నాతో కాసేపు ఆడవా?’’ అని అడిగాడు.

‘‘ఇప్పుడు నేను పొలానికి వెళ్ళాలి. పంటలు పండించడానికి బోలెడంత పని చేయాలి. ఇప్పటికే నాకు ఆలస్యం అయ్యింది. రైతు అక్కడ నా కోసం ఎదురుచూస్తూంటాడు. నేను రాలేను!’’ అని చెప్పి ముందుకు కదిలింది ఎద్దు. అది విని రంగడు ఆలోచనలో పడ్డాడు. ‘అమ్మానాన్నలు పనుల్లోకి వెళ్ళారు. పిల్లలంతా చదువుకోవడానికి వెళ్ళారు. ఇళ్లలో ఉన్న ముసలివారు కూడా ధాన్యం బాగు చేయడం లేదా, చిన్న పిల్లల్ని చూస్తూ ఇంటికి కాపలా ఉన్నారు. ఇలా ప్రతివారూ ఏదో ఒక పని చేస్తున్నారు. తనొక్కడేనా ఏ పనీపాటా లేకుండా ఉన్నది?’ ఈ ఆలోచన కలుగగానే రంగడికి తను చేస్తున్న తప్పేమిటో అర్థం అయింది. ఇక ఆరోజు నుండి తన ప్రవర్తన మార్చుకుని బుద్ధిగా బడికి వెళ్ళసాగాడు.

ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి

ఒక రాజుకు ఒక అందమైన కూతురు ఉండేది. వారి రాజభవనం పరిసరాల్లో ఒక అడవి, దానిలో ఒక బావి ఉండేది. ప్రతి రోజూ బుజ్జి యువరాణి ఆ బావి పక్కన కూర్చుని ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు ఆమె ఆడుకుంటుండగా బంతి ఆ లోతైన బావిలో పడిపోయింది. 


"అయ్యో నా అందమైన బంతి", అంటూ ఏడ్చిందా యువరాణి. "ఏమయింది యువరాణి?" అని బావిలో నుంచి ఒక స్వరం వినిపించింది. బావిలోకి తొంగి చూసిన ఆ అమ్మాయికి ఒక కప్ప కన్పించింది. "నా బంతి బావిలో పడిపోయింది" ఏడుస్తూ చెప్పింది యువరాణి.

"ఏడవకు", అంది కప్ప. "నేను నీ బంతిని తీసిస్తాను. మరి బదులుగా నువ్వు నాకేమిస్తావు?" అని అడిగింది. "నీకేం కావాలి? నా దుస్తులా, నా ఆభరణాలా, నా బంగారు కిరీటమా?" అని అడిగింది యువరాణి."అవేవీ కావు! నన్ను నీ స్నేహితుడిలా చేసుకుంటే చాలు. నన్ను నీ టేబుల్‌పై కూర్చోనివ్వాలి, నీ బంగారు పళ్లేంలో తిననివ్వాలి, నీ బంగారు గ్లాసులో తాగనివ్వాలి, అప్పుడే నేను నీకు అందమైన బంతిని తెచ్చిస్తాను". అంది కప్ప. "సరే, నేనన్నింటికీ ఒప్పుకుంటున్నాను", అంది యువరాణి. కప్ప ఒక్క ఉదుటున నీటిలోకి దూకి బంతిని పైకి తెచ్చింది.

అంతే యువరాణి గబుక్కున బంతిని లాక్కుని కనీసం 'కృతజ్ఞతలు' కూడా చెప్పకుండా ఇంట్లోకి పరుగుపెట్టింది. "ఆగు, ఆగు", అని అరిచింది కప్ప. కాని యువరాణి వినకుండా పరిగెత్తడంతో కప్ప చేసేదేమీలేక బావిలోకి జారుకుంది.మరునాడు యువరాణి నిద్రలేచి బయటకు వస్తుంటే గుమ్మం దగ్గర ఆ కప్ప కనబడింది. ఆ కప్పను చూడగానే యువరాణి తలుపు మూసి తండ్రి దగ్గరకు పరిగెత్తింది.

"ఏమయింది, తల్లీ?" అని అడిగాడు రాజు. జరిగిన విషయం తండ్రితో వివరించి చెప్పింది యువరాణి."ఎలాంటి పరిస్ధితిలో నైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. కప్పను ఇంట్లోకి రానివ్వు" అన్నాడు రాజు.యువరాణి తలుపు తెరవగానే, కప్ప నేరుగా భోజనాల బల్ల దగ్గరకు వెళ్లి, కుర్చీ పైకి ఎక్కింది. "నన్ను పైకి తీసుకో. నేను నీ బంగారు పళ్లెంలో భుజించాలి" అని యువరాణితో అంది కప్ప. యువరాణి బంగారు పళ్లెం చేత్తో పట్టుకుని, కప్పను ముట్టుకోగానే, అది ఒక అందమైన అబ్బాయిలా మారిపోయింది.

"నేను ఒక రాకుమారుడిని. ఒక దుర్మార్గపు మంత్రగత్తె నన్ను కప్పలా మార్చింది. ఒక రాకుమార్తె స్పర్శ తిరిగి నన్ను రాకుమారుడిగా మారుస్తుందని ఆ మంత్రగత్తె చెప్పింది". అన్నాడు కప్ప రూపం నుండి మనిషిగా మారి ఆ రాకుమారుడు.అది విని రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత రాకుమారుడిని తమ దగ్గరే ఉండమని కోరాడు రాజు. తనకు కొడుకులు లేని లోటు తీరినందుకు రాజు, అన్న దొరికినందుకు యువరాణి ఎంతగానో సంతోషించారు.

నిజమైన మేధావి

రాజు తెలివైన కుర్రాడు.ఒకరోజు సెలయేటి దగ్గర నడుస్తూ వెళ్తున్నాడు. హఠాత్తుగా అతనికో  గొంతు   వినిపించింది. అది పక్కనే ఉన్న చెట్టు కింద నుంచి వస్తోందని గమనించాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక సీసా కనిపించింది. ఆ సీసాలో ఒక చిన్న మనిషిలాంటి జీవి ఉంది. ఆ జీవి మూత తీసి తనను విడిపించమని రాజును అర్ధించింది.


చిన్న రూపంలో ఉన్న జీవిపై ఏ మాత్రం అనుమానం రాని రాజు సీసామూత తీశాడు. వెంటనే అందులో నుంచి దట్టమైన పొగ, మధ్య నుంచి ఒక భయంకరమైన భుతం బయటకు వచ్చింది. దానిని చూసి రాజు భయంతో "ఎవరు నువ్వు?" అని అడిగాడు. "నేను భూతాన్ని, ఒక మంత్రగాడు నన్ను ఈ సీసాలో బంధించాడు. నేనిప్పుడు స్వేచ్చగా ఉన్నాను. నిన్ను తినేస్తాను" అంటూ పెద్దగా అరిచింది ఆ భూతం.

తెలివైన రాజు, "నేను నిన్ను నమ్మను. ఇంత పెద్దగా ఉన్నావు, నువ్వు ఈ చిన్న సీసాలో ఎలా ప్రవేశించావు?" అని అడిగాడు. దానికి ఆ భూతం "ఎందుకు ప్రవేశించలేను. కావాలంటే చూపిస్తాను" అంటూ సీసాలోకి ప్రవేశించింది. ఏ మాత్రం ఆలస్యం చెయకుండా రాజు వెంటనే ఆ సీసా బిరడా బిగించేశాడు. అది చూసిన భూతం "దయచేసి నన్ను విముక్తుడిని చెయి. నేను నీకు ఏ మాత్రం హాని చేయను" అని బతిమాలసాగింది. "నేను నిన్ను ఎలా నమ్ముతాను? నిన్ను బయటకు వదిలితే వెంటనే నన్నే తినాలని అనుకున్నావు" అన్నాడు రాజు. భూతం "నేను నీకు అపకారం చెయ్యను. అంతేకాకుండా నీకొక అద్భుతమైన మంత్రదండం కూడా ఇస్తాను. దానిని ముట్టుకున్న వెంటనే రోగాలు మాయమైపోతాయి. హాయిగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ముందుగా నువ్వు ఏ వస్తువును తాకితే అది బంగారంగా మారుతుంది" అని చెప్పింది.

దాని మాటలు నమ్మిన రాజు భూతాన్ని సీసాలో నుంచి విడిపించాడు. భూతం ఇచ్చిన అద్భుతమైన మంత్రదండం సహాయంతో... అది చెప్పిన సంగతి కుడా గుర్తుంచుకుని మరి దేనినీ ముట్టుకోకుండా నేరుగా వెళ్లి పెద్ద చెట్టును ముట్టుకున్నాడు. అది బంగారంగా మారింది. అనతికాలంలోనే సంపన్నుడయ్యడు రాజు.

మేకపోతు గాంభీర్యం


అనగనగా ఒక మేక దాని యజమానికి ఆ మేక అంటే ఎంతో ఇష్టం. ఆ మేకకు కృష్ణుడు అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకోసాగాడు ఆ యజమాని. ఒక రోజు . . . మిగతా మేకలతో కలిసి కృష్ణుడుని కూడా అడవికి మేతకు తీసుకుని వెళ్లాడు. కృష్ణుడు మేకల మందతో కలిసి అడవిలో బాగా ఆడుకుంది. కడుపునిండా గడ్డి, ఆకులు అలములు తిన్నది. ఆ రోజు దానికి చాలా ఆనందంగా ఉంది. ఉరుకులు పరుగులు పెడుతూ అడవి అంతా తిరిగిన ఆ మేకపిల్ల అందరికన్నా ముందు వెళ్లాలన్న ఉత్సాహంతో మందనుంచి తప్పిపోయింది. చాలాసేపు అడవి అంతా తిరిగింది. ఎంతసేపు తిరిగినా అది మేకల మందను చేరుకోలేకపోయింది. అప్పటికే చీకటి పడిపోవడంతో ఇక చేసేదేం లేక ఎటు పోవాలో తెలీక ఒక గుహ కనబడితే ఆ గుహ లోపలికి పోయి పడుకుంది. కొంతసేపటికి ఏదో అలికిడి వినిపిస్తే కృష్ణుడికి మెలకువ వచ్చి లేచింది. ఆ గుహలో నివాసం ఉంటున్న సింహం దాని వేట ముగించి సుష్టుగా భోజనం చేసినట్టుంది. త్రేంచుకుంటూ వచ్చింది. సింహం గురించి ఇంతకుముందు వినడమే తప్ప కృష్ణుడు దానిని ఎప్పుడూ చూడలేదు. అలాంటిది సింహాన్ని చూడగానే మేకపోతుకు గుండెలు దడదడలాడాయి. కానీ తను భయపడినట్టు కనిపిస్తే సింహం తనను వదిలి పెట్టదు అని కృష్ణుడికి అర్ధం అయ్యింది. సింహం కూడా మేకపోతును చూసి భయపడింది. చీకటిలో మేకపోతు కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. పెద్ద గడ్డము, కొమ్ములు, ఉన్న ఆ వింత జంతువును చూడగానే సింహానికి కూడా భయం వేసింది. ఈ వింత జంతువు బహుశా నన్ను చంపడానికే వచ్చినట్టుంది. అందుకే ఇక్కడకు వచ్చి నాకోసం ఎదురు చూస్తోంది అని అనుకుంది.

చీకటిలో తనను చూసి ఏదో వింత జంతువు అని సింహం అనుకుంటుందని అందుకే భయపడిందని మేకపోతుకు అర్ధం అయ్యింది. అది అలా తనను చూసి భయపడుతూ ఉండగానే దాన్ని ఇంకా భయపెట్టాలి. ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని మేకపోతు నిర్ణయించుకుంది. కానీ ఈ చీకటిలో ఎలా తప్పించుకోవడం? ఒక వేళ తప్పించుకుని వెళ్ళినా ఈ చీకటిలో ఈ అడవిలో ఎక్కడికని వెళుతుంది? కాబట్టి ఎలాగోఅలా తెల్లవారుఝాముదాకా ఇక్కడే ఉండి ఆ తర్వాత తప్పించుకోవాలి అని అనుకుని మేకపోతు గంభీరంగా అలాగే కూర్చుండిపోయింది. మరోపక్క సింహం కూడా అలాగే అనుకుంది. తెల్లవారితే ఆ వింత జంతువు ఏదో తెలుసుకోవచ్చు. ఒకవేళ అది నాకన్నా బలవంతురాలైతే దానితో స్నేహం చేసుకోవచ్చు. ఒకవేళ ఆ జంతువు తనకన్నా బలహీనురాలైతే దానిని సంహరించవచ్చు ఏదైనా తెల్లారే వరకు ఇలా మౌనంగా ఉండకతప్పదు అని సింహం అనుకుంది.

మేకపోతు, సింహం రెండూ కూడా నిద్రపోకుండా రాత్రంతా ఒకదానినొకటి గమనిస్తూ కూర్చున్నాయి. తెల్లవారుతుండగా మేకపోతు ధైర్యం తెచ్చుకుంది. అప్పుడే సింహాన్ని గమనిస్తున్నట్టుగా "ఏయ్ ఎవరు నువ్వు?" అని గద్దించింది. సింహంకు ఇంకా బెదురుపోలేదు. "నేను సింహాన్ని . . . మృగరాజును. నేనే ఈ అడవికి రాజును." అంది భయం భయంగా."నువ్వు ఈ అడవికి రాజువా!? చాలా విచిత్రంగా ఉంది. ఇంత బక్కపలచగా ఉన్నావు. నువ్వు ఈ అడవికి రాజువేంటి? అంటే ఈ అడవిలో మిగతా జంతువులు నీకన్నా బలహీనంగా ఉంటాయన్నమాట. సరే ఏది ఏమైనా నా అదృష్టం పండింది. నేను ఇంతవరకు లెక్కలేనన్ని పులులను, వెయ్యి వరకు ఏనుగులను చంపాను. అది కూడా నా వాడి కొమ్ములతో ఒక్క సింహాన్ని మినహా అన్ని జంతువులను నా కొమ్ములతో ఒక్క కుమ్ము కుమ్మి చంపేసాను. సింహాన్ని కూడా చంపితే నా దీక్ష పూర్తి అవుతుంది. సింహాన్ని చంపేవరకు ఈ గడ్డం తీయనని నేను ప్రతిఙ్ఞ పూనాను. నేటితో నా దీక్ష పూర్తి అయినట్టే" అంటూ సింహం మీదకు ఒక్క దూకు దూకింది.

అంతే సింహం పెద్దగా అరుస్తూ ఆ గుహలోంచి బయటకు పరుగు తీసింది. మేకపోతు సూర్యోదయం అయ్యేవరకు ఆ గుహలోనే ఉండి సూర్యోదయం అయ్యాక అడవిలోకి వెళ్ళింది. అప్పటికే దాని యజమాని వెతుక్కుంటూ అటువైపుగా వచ్చాడు. కృష్ణుడు యజమానిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. యజమాని దానిని చూసి చాలా సంబరపడ్డాడు. "నువ్వు ఎక్కడికి వెళ్లిపోయావో అని నేను ఎంత ఖంగారుపడ్డానో తెలుసా? రాత్రంతా ఇంటికి రాకపోతే అడవిలో తప్పిపోయి తిరుగుతున్నావో లేక ఏ జంతువుకైనా ఆహారమయిపోయావో అని భయపడ్డాను. పోన్లే నువ్వు క్షేమంగా ఉన్నావు కదా నాకు అదే చాలు". అని అంటూ కృష్ణుడ్ని దగ్గరకు తీసుకున్నాడు. కృష్ణుడు ఆ తర్వాత మేకల మందతో కలిసి ఇంటి దారి పట్టాడు.

పాము - కోడి పెట్ట

అనగనగా ఒక చిన్న అడవి. అందులో ఒక కోడిపెట్ట ఉంది. అది ఒకసారి పది గుడ్లు పెట్టి పొదిగింది. ఆ గుడ్లలోంచి బుజ్జి బుజ్జి కోడిపిల్లలు బయటకు వచ్చాయి. వాటిని చూసుకుని కోడిపిట్ట ఎంతో మురిసిపోయింది. పిల్లలు కొంచెం పెద్దయ్యాక ఒకరోజు వాటిని ఆరుబయటకు తీసుకువె ళ్లింది. గింజలు ఏరుకుని ఎలా తినాలో నేర్పించసాగింది.

అంతలో హఠాత్తుగా పొద చాటున దాక్కున్న ఒక పాము బుస్సుమని ఇవతలకు వచ్చింది. పామును చూడగానే కోడిపెట్ట తన బుజ్జిబుజ్జి పిల్లల్ని పారిపొమ్మని హెచ్చరికగా అరిచింది. ప్రమాదాన్ని అర్థం చేసుకుని కోడిపిల్లలు చెల్లాచెదరయ్యాయి. పాపం ఒక కోడిపిల్ల మాత్రం పాముకు దొరికిపోయింది. పాము దాన్ని నోటితో కరుచుకుని వెళ్లిపోయింది.
 

అది మొదలు ఆ పాము పొదల వెనుక, చెట్ల చాటున మాటువేయడం, అదను దొరకగానే కోడిపిల్లను పట్టుకుని తినేయడం మొదలుపెట్టింది. తన పిల్లలు పాముకు ఆహారమవుతూ ఉండటం చూసి కోడిపెట్ట తట్టుకోలేకపోయింది. ఒకరోజు పాము కోసం వెతుకుతూ వెళ్లింది. కొద్దిదూరంలో ఒక చెట్టు కింద పాము పుట్ట ఉంది. పాము అందులో నుంచి బయటకు వస్తూ కనిపించింది.

 

వెంటనే దాని దగ్గరకు వెళ్లి, ‘‘నువ్వు ప్రతిరోజూ నా పిల్లల్ని తింటున్నావు. నీకిది న్యాయం కాదు. నాకు రెండు పిల్లలు మాత్రమే మిగిలాయి. దయచేసి వాటిని తినకు’’ అంటూ ప్రాధేయపడింది. పాము నిర్లక్ష్యంగా ‘‘పోవమ్మా! నేను నా ఆహారాన్ని తింటున్నాను. వద్దని చెప్పడానికి నువ్వెవరు? రేపు వచ్చి వాటిని కూడా తినేస్తాను’’ అంది.

 

కోడిపెట్ట ఎంత బతిమాలినా పాము వినిపించుకోలేదు. పాముకి తగిన శాస్తి చేయాలనుకుంది కోడిపెట్ట. బాగా ఆలోచించాక ఒక మంచి ఉపాయం తట్టింది. తనతో ఎంతగానో స్నేహంగా ఉండే తేనెటీగల సహాయం తీసుకుందామనుకుంది. అనుకున్నదే తడవుగా కోడిపెట్ట తేనెటీగల దగ్గరకు వెళ్లి విషయమంతా విడమర్చి చెప్పి తనకు సహాయం చేయమని అర్థించింది. తేనెటీగలు ఒప్పుకున్నాయి.

 

తేనెతుట్టెలో ఉండే తేనెను బయటకు తీసి దానిని పాము పుట్టలో పోశాయి. పుట్టలో ఉన్న పాము తేనెలో మునిగిపోయింది. కొద్దిసేపటికే చీమలు తేనె వాసనను పసికట్టాయి. ఆ చీమలు కూడా పాము మీద చాలా కోపంగా ఉన్నాయి. అవి ఎంతో కష్టపడి పుట్ట నిర్మించుకుంటే పాము దాన్ని ఆక్రమించుకుని వాటిని బయటకు తరిమేసింది. అందుకే కొన్ని వందల చీమలు తండోపతండాలుగా పుట్ట చుట్టూ చేరాయి. చీమలను చూసి పాము భయంతో పారిపోవడానికి ప్రయత్నించింది. అయితే చీమలు దానికి ఆ అవకాశం ఇవ్వలేదు. ఒక్కసారిగా దాని మీదకు దాడి చేసి కసిదీరా కుట్టాయి. లబోదిబోమంటూ పాము అక్కడి నుండి దూరంగా పారిపోయింది.పాము బెడద తప్పిన కోడిపెట్ట మిగిలిన పిల్లలతో హాయిగా ఉండసాగింది.